Janasena Chief Pawan Kalyan Meets Union Minister Prahlad joshi In Delhi :
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు సినిమాలకు కాస్తంత విరామం ఇచ్చి మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఏపీలో రోడ్ల దుస్థితిపై ఆయన పిలుపు మేరకు జనసైనికులు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ వేదికగా ఓ రేంజిలో నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ నిరసనలు వైసీపీని బాగానే ఇబ్బంది పెడుతున్నట్లుగానే ఉంది. ఈ క్రమంలో ఈ నిరసనలను పవన్ మానీటరింగ్ చేస్తున్నారని అంతా అనుకున్నారు. ఈ మాట నిజమేనన్నట్లుగా మంగళవారం నాడు ఓ వీడియో విడుదల చేసిన జనసేన.. రోడ్ల దుస్థితిపై జగన్ సర్కారు స్పందించిన వైనంపై పవన్ తనదైన స్టైల్లో పంచ్ లు విసిరారు. అయితే ఈ వీడియోలో పవన్ ఎక్కడి నుంచి మాట్లాడారన్న స్పష్టత లేదు. ఎందుకంటే.. మంగళవారం ఉదయమే పవన్ నేరుగా ఢిల్లీ ఫ్లైటెక్కేశారట. మంగళవారం ఢిల్లీలో ల్యాండైన పవన్.. ఇంకా అక్కడే ఉన్నారో, లేదంటే తిరిగి వచ్చారో కూడా తెలియడం లేదు.
ప్రహ్లాద్ జోషితో భేటీ
అయినా పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లారని ఎవరు చెప్పారంటే.. స్వయంగా జనసేననే ఈ మేరకు ప్రకటించింది. బీజేపీ నేతల ఆహ్వానం మేరకే హుటాహుటీన పవన్ మంగళవారం ఉదయమే ఢిల్లీ వెళ్లారని, అక్కడికి చేరుకున్న పవన్.. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, మైనింగ్ మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయ్యారు. అసలు ప్రహ్లాద్ జోషి ఆహ్వానం మేరకే పవన్ ఢిల్లీ ఫ్లైటెక్కినట్టు కూడా జనసేన చెబుతోంది. అయితే ప్రహ్లాద్ జోషి ఏ కారణం చేత పవన్ ను ఢిల్లీకి పిలిపించారన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. అంతేకాకుండా ప్రహ్లాద్ జోషితో పవన్ భేటీలో ప్రస్తావనకు వచ్చిన అంశాలను కూడా ఆ పార్టీ వెల్లడించలేదు. మొత్తంగా పవన్ ఢిల్లీకి వెళ్లారు, ప్రహ్లాద్ జోషినే పవన్ ను ఢిల్లీకి పిలిపించారు.. ప్రహ్లాద్ జోషితో పవన్ భేటీ అయ్యారు.. ఆ తర్వాత మరికొందరు బీజేపీ ప్రముఖులను కూడా పవన్ కలిశారు.. ఈ నాలుగు ముక్కలను మాత్రమే చెప్పిన జనసేన.. మిగిలిన ఏ వివరాలను వెల్లడించలేదు.
ఒంటరి పోరాటంపైనే చర్చా?
ఏపీలోని రహదారుల పరిస్థితిపై ఇప్పుడు జనసేన చేస్తున్న ఆందోళనలు వైసీపీని షేక్ చేస్తున్నాయనే చెప్పాలి. అదే సమయంలో వినాయక చవితి ఉత్సవాలను రద్దు చేస్తూ జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై బీజేపీ నేతలు తమదైన శైలిలో నిరసనలను హోరెత్తిస్తున్నారు. మిత్రపక్షాలుగా ఉన్న ఈ రెండు పార్టీలు.. ఈ నిరసనలను కలిసే కొనసాగించవచ్చు. అందుకు విరుద్ధంగా జనసేన నిరసనల్లో బీజేపీ కనిపించడం లేదు. బీజేపీ నిరసనల్లో జనసేనా కనిపించడం లేదు. రెండు పార్టీలు కలిసి ఉద్యమాలు చేపడితే మరింత మేర ఇంపాక్ట్ ఉంటుందన్న విషయాన్ని పవన్ కు చెప్పేందుకే ప్రహ్లాద్ జోషి ఆయనను ఢిల్లీకి పిలిపించారా? అన్న దిశగా ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది జోషితో పాటు పవన్ మరికొందరు బీజేపీ నేతలను కలిశారని జనసేన చెబుతున్నా.. వారు ఎవరు? ఏం మాట్లాడారు? అన్న వివరాలు మాత్రం బయటకు రాలేదు. అసలు మంగళవారం ఢిల్లీకి వెళ్లిన పవన్.. తిరిగి వచ్చేశారా? లేదంటే మోదీ, అమిత్ షాలను కలిసేందుకు అక్కడే ఉన్నారా? అన్న విషయం కూడా వెల్లడి కాలేదు.
Must Read ;- అడుగుకో గుంత.. గజానికో గొయ్యి