గులాబీ దళపతి, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు శుక్రవారం సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయం భూమి పూజ కోసం రెండు రోజుల క్రితమే ఢిల్లీ చేరుకున్న కేసీఆర్.. గురువారం నాడు ఆ పనిని ముగించారు. ఆ తర్వాత గురువారం మొత్తం విశ్రాంతిలోనే ఉండిపోయిన కేసీఆర్.. శుక్రవారం నాడు నేరుగా ప్రధానితో భేటీ అయ్యారు. ఎంతమాత్రం హడావిడి లేకుండా మోదీ అపాయింట్ మెంట్ సంపాదించిన కేసీఆర్.. శుక్రవారం నాడు మోదీతో భేటీ అయ్యారు.
చర్చకొచ్చిన అంశాలివేనా?
మోదీతో భేటీ సందర్భంగా కేసీఆర్ చాలా కీలకమైన అంశాలను ప్రస్తావించినట్లుగా సమాచారం. ఏపీతో తెలంగాణకు నెలకొన్న జల వివాదాన్ని ప్రస్తావించిన కేసీఆర్.. రాయలసీమ పథకం పేరిట ఏపీ సర్కారు పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతున్న విషయాన్ని మోదీ దృష్టికి తీసుకెళ్లినట్లుగా సమాచారం. అంతేకాకుండా కృష్ణా, గోదావరి జలాలకు సంబంధించి ఇటీవల కేంద్రం విడుదల చేసిన గెజిట్ ను కూడా ప్రస్తావించిన కేసీఆర్.. గెజిట్ పై తెలంగాణ వ్యాప్తంగా పెల్లుబుకుతున్న నిరసనలను, ఈ గెజిట్ ద్వారా తమ ప్రభుత్వంపై పడుతున్న ఆర్థిక భారాన్ని కూడా మోదీ దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైనా మోదీ వద్ద కేసీఆర్ ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది.
రాజకీయాల ప్రస్తావన లేదా?
తెలంగాణలో అధికార పార్టీగా ఉంటూనే.. జాతీయ రాజకీయాల్లో కూడా సత్తా చాటాలన్న దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు ఫెడరల్ ఫ్రంట్ అంటూ కేసీఆర్ నానా హంగామా చేసిన సంగతీ తెలిసిందే. తాజాగా తన కేబినెట్ లోని ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేరుగా వెళ్లి బీజేపీలో చేరిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హుజూరాబాద్ బైపోల్స్ లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగానే పోటీ సాగుతోంది. అంతేకాకుండా జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నింటినీ కూడగట్టే దిశగా కాంగ్రెస్, ఎన్సీపీలతో పాటు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా దూకుడుగా సాగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మోదీతో భేటీలో కేసీఆర్ చాలా రాజకీయ అంశాలనే ప్రస్తావించి ఉంటారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఏఏ అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగిందన్న దానిపై మాత్రం ఎప్పటికీ స్పష్టత రాదనే చెప్పాలి.
Must Read ;- అందరూ ఉన్నా.. మేనల్లుడే మిస్సింగ్