Jr NTR Cutouts In Chandrababu Naidu Tour :
తెలుగు దేశం పార్టీలో ఇటీవలి కాలంలో కొన్ని చోట్ల కొందరు పార్టీ కార్యకర్తల గోల బాగానే ఎక్కువైందని చెప్పాలి. పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పర్యటనల్లోనే కొందరు తెలుగు తమ్ముళ్లు చేస్తున్న ఈ గోల ఉద్దేశమేమిటో తెలియదు గానీ.. పార్టీ అధిష్ఠానానికి మాత్రం కాస్తంత ఇబ్బందికరంగానే ఉందని చెప్పాలి. అలాగని ఈ గోలకు దిగుతున్న పార్టీ శ్రేణులపై చంద్రబాబు కసురుకోవడం గానీ, కస్సుమనడం గానీ చేయట్లేదు. ఎందుకంటే.. ఆ గోల చేస్తున్న వారికి రాజకీయాలపై ఎంతమేర ఆసక్తి ఉందో పాలిటిక్స్ లో తల పండిన బాబుకు తెలుసు కాబట్టి. అందులోనూ వారు గొంతెత్తి నినదిస్తున్న పేరు తనకు శత్రువేమీ కాదు. తన కుటుంబ సభ్యుడే. అయితే రాజకీయాలపై అంతగా ఇంటరెస్ట్ లేదని ఆయనే స్వయంగా చెప్పారు కదా. మరి ఆ విషయం తెలిసి కూడా తెలుగు తమ్ముళ్లు చేస్తున్న ఈ గోల చూస్తే.. ఒకింత అసహనం అయితే కలగడం ఖాయమే.
కటౌట్లు.. కేకలు
అయినా ఆ కొందరు తెలుగు తమ్ముళ్ల గోలేంటో చూద్దాం పదండి. మొన్నామధ్య తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు బాబు వెళితే.. రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ రావాలని, ఏపీకి కాబోయే సీఎం ఆయనేనని పెద్ద పెద్ద కటౌట్లు ఏర్పాటు చేసిన తమ్ముళ్లు.. బాబు ముందే నినాదాలు కూడా చేశారు. ఆ సందర్భంగా బాబు పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. తాజాగా బుధవారం కృష్ణా జిల్లా మచిలీపట్నం వెళ్లిన చంద్రబాబు.. ఇటీవలే తండ్రిని కోల్పోయిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగానూ జూనియర్ ఎన్టీఆర్ కటౌట్లు పట్టుకుని కొందరు తమ్ముళ్లు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఇప్పుడు కూడా చంద్రబాబు ఈ గోలను పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి.
సినిమాల్లో పీక్ స్టేజ్..
జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ రేంజిలో ఉన్నారు కదా. అప్పుడెప్పుడో 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేసిన జూనియర్.. ఆ తర్వాత రాజకీయాల్లో అస్సలు కనిపించలేదనే చెప్పాలి. అంతేకాకుండా తనకు రాజకీయాల మీద అంతగా ఇంటరెస్ట్ లేదని కూడా స్వయంగా జూనియరే చెప్పేశారు. అంతేకాకుండా సినిమాల్లో మంచి పీక్ స్టేజ్ లో ఉన్న జూనియర్ కు అసలు పాలిటిక్స్ వైపు చూసే టైం కూడా లేదనే చెప్పాలి. మొత్తంగా తనకు రాజకీయాలంటే ఆసక్తే లేదని ఓ వైపు జూనియర్ ప్రకటిస్తుంటే.. మరోవైపు కొందరు తెలుగు తమ్ముళ్లు చేస్తున్న ఈ గోల అందరికీ చికాకు తెప్పించే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- బాబు అంటే.. టీఆర్ఎస్కు ఇంకా భయమే