No Z-Plus Security For Chandrababu Naidu :
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు జెడ్ ప్లస్ కేటగిరీలో భద్రత కొనసాగుతోంది. ఉమ్మడి ఏపీకి పదేళ్ల పాటు సీఎంగా, మరో పదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా కొనసాగిన ఆయన.. నవ్యాంధ్రప్రదేశ్ కు ఐదేళ్లు సీఎంగా వ్యవహరించారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. తన సొంత జిల్లా చిత్తూరులోని తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళుతున్న సందర్భంగా గతంలో ఆయనపై మావోయిస్టులు ల్యాండ్ మైన్ తో విరుచుకుపడ్డారు. ఆ సందర్భంగా ఆ వేంకటేశ్వరుడి దయ వల్లే ఆయన స్వల్ప గాయాలతో బయటపడగలిగారు. నాటి ఘటనను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వం జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించింది. కేంద్రంలో ప్రభుత్వాలు మారినా.. చంద్రబాబు భద్రత విషయంలో మాత్రం మార్పు రావడం లేదు. అయితే ఏపీలో ఇటీవలే కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం చంద్రబాబు భద్రత విషయంలో తనదైన శైలి వైఖరితో సాగుతున్నారు. చంద్రబాబు పర్యటనల్లో జెడ్ ప్లస్ కేటగిరీకి అనుగుణంగా భద్రత కల్పించే విషయంలో జగన్ సర్కారు దృష్టి సారించడం లేదు. ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్న ఈ పరిణామాల వల్ల చంద్రబాబుకు అనుకోని ముప్పు వాటిల్లితే బాధ్యత ఎవరు వహిస్తారన్న దిశగా ఇప్పుడు టీడీపీ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
నిబంధనల మేరకు కాన్వాయ్ ఎక్కడ?
టీడీపీ సీనియర్ నేత, శాప్ మాజీ చైర్మన్ పీఆర్ మోహన్ సోమవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన భౌతిక కాయానికి నివాళి అర్పించడంతో పాటుగా ఆయన కుటుంబాన్ని పరామర్శించే నిమిత్తం సోమవారం చంద్రబాబు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి వెళ్లారు. ఈ క్రమంలో రేణిగుంట ఎయిర్ పోర్టుకు విమానంలో వెళ్లిన చంద్రబాబు.. అక్కడి నుంచి రోడ్డు మార్గం మీదుగా శ్రీకాళహస్తి వెళ్లారు. మోహన్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం తిరిగి రోడ్డు మార్గం మీదుగానే చంద్రబాబు రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఇలా రేణిగుంట నుంచి శ్రీకాళహస్తి, అక్కడి నుంచి తిరిగి రేణిగుంటకు రోడ్డు మార్గం మీదుగా ప్రయాణించిన చంద్రబాబుకు జగన్ సర్కారు నిబంధనల మేరకు భద్రతను కల్పించలేదు. చంద్రబాబు కాన్వాయ్ ను పరిశీలించిన వారంతా ఈ విషయాన్ని పసిగట్టి.. ఆందోళనకు గురయ్యారు. జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న చంద్రబాబుకు ఆ స్థాయికి తగ్గ భద్రత కల్పించకపోతే ఎలా? ఈ క్రమంలో చంద్రబాబుకు అనుకోని రీతిలో ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? అన్న కోణంలో టీడీపీ శ్రేణులతో పాటు సామాన్య జనం కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాబు వెనకాల దూరంగా రోప్ పార్టీనా?
శ్రీకాళహస్తిలో చంద్రబాబుకు కల్పించిన భద్రత ఎలా సాగిందన్న విషయానికి వస్తే.. చంద్రబాబు కాన్వాయ్‌లో ఉండే పోలీసు వాహనాలకు, చంద్రబాబు వెళ్లే వాహనానికి సంబంధం లేకుండా పర్యటన సాగింది. రెండు, మూడు చోట్ల కాన్వాయ్‌కు ఎదురుగా పెద్ద పెద్ద లారీలను కూడా వదిలేశారు. అదేవిధంగా కాన్వాయ్‌కి చెందిన పదో నెంబరు వాహనంగా చిన్న కారును ఏర్పాటు చేయడం.. అది కాన్వాయ్‌కు ఏమాత్రం సంబంధం లేకుండానే ప్రయాణించడం కనిపించింది. అసలు ఆ వాహనం చంద్రబాబు కాన్వాయ్ లోని వాహనమేనా? అన్న అనుమానాలూ కలిగాయి. ఇక చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా.. ఆయనకు రోప్ పార్టీ భద్రత కల్పిస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం నాటి చంద్రబాబు పర్యటనలోనూ రోప్ పార్టీకి సంబంధించిన సిబ్బందిని ఏర్పాటు చేసినా.. ఆ సిబ్బంది ఉన్న వాహనం చంద్రబాబు కాన్వాయ్ వెంటే సాగలేదు. శ్రీకాళహస్తి నుంచి రేణిగుంటకు చంద్రబాబు చేరుకున్ని నిమిషాలకు గానీ.. రోప్ పార్టీ వాహనం అక్కడికి చేరుకోలేదు. సాధారణంగా చంద్రబాబు కంటే ముందుగానే రోప్ పార్టీ ఆయన కారు దిగే ప్రాంతానికి చేరుకోవాల్సి ఉంది. అయితే చంద్రబాబు ఎయిర్ పోర్ట్ చేరుకున్న పది నిమిషాల తర్వాత రోప్ పార్టీ వాహనం అక్కడికి చేరుకోవడం చూస్తుంటే.. బాబు భద్రత విషయంలో జగన్ సర్కారు ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చెప్పక తప్పదు. మరి ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబుకు ఏదేనీ అనుకోని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారన్న ప్రశ్న ఇప్పుడు అందరి నోటా వినిపిస్తోంది.
Must Read ;- సీబీఐ ఓకే అంటే.. వారంలో జైలుకు జగన్