Rajinikanth Exits Before Entry Into Politics :
అనుకున్నంతా అయ్యింది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఓ రేంజి ఉత్సాహం చూపిన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రిటైర్ట్ హర్ట్ అయ్యారు. రజినీ మక్కల్ మండ్రం పార్టీని రద్దు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. అదే సమయంలో రజనీ అభిమాన సంక్షేమ మండ్రం పేరిట ఛారీటీ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు సోమవారం అభిమానులతో సమావేశమైన ఆయన రెండు సంచలన ప్రకటనలు చేశారు. ఇటీవలే వైద్య చికిత్సల నిమిత్తం అమెరికా వెళ్లిన రజినీ.. ఆదివారమే చెన్నై తిరిగి వచ్చారు. వచ్చీ రాగానే.. సోమవారం అభిమానులతో సమావేశమైన రజినీ తన రాజకీయ రంగప్రవేశంపై పూర్తి స్థాయి క్లారిటీ ఇచ్చారు. ఇకపై రాజకీయాలు ఉండబోవని, తాను సినిమాలకు, అభిమానుల సంక్షేమానికి మాత్రమే పరిమితమవుతున్నట్లుగా తేల్చి చెప్పేశారు.
ఇద్దరు నేతల మరణం.. బీజేపీకి భంగపాటు
తమిళనాడులో రాజకీయ పరిణామాలు ఆ ఒక్క రాష్ట్రాన్నే కాకుండా యావత్తు దేశానికీ ఆసక్తి రేకెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో సీఎంగా ఉండగానే.. అనారోగ్యానికి గురైన అన్నాడీఎంకే అధినేత్రి రోజుల తరబడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటన జరిగిన మరికొన్ని రోజులకే అదే తరహాలో అనారోగ్యానికి గురైన మరో కీలక నేత, డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి కూడా కన్నుమూశారు. రాష్ట్ర రాజకీయాలను తమదైన శైలిలో మార్చేసిన ఇద్దరు కీలక నేతలు ఒకేసారి నెలల వ్యవధిలోనే మరణించడంతో నిజంగానే తమిళనాడులో రాజకీయ శూన్యత ఏర్పడిందనే చెప్పాలి. ఈ తరహా పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకోవాలని బీజేపీ అధిష్ఠానం యత్నించి భంగపాటుకు గురైంది. అంతేకాకుండా స్థానికత లేకుండా తమిళనాడు రాజకీయాల్లో రాణించలేమన్న నగ్న సత్యాన్ని బీజేపీ గుర్తించినట్లైందన్న వాదనలూ వినిపించాయి.
ఎంట్రీ ఇచ్చి.. ఆ వెంటనే విమరణ
తమిళనాట ఇద్దరు కీలక నేతలు నెలల వ్యవధిలో మరణించిన నేపథ్యంలో తమిళనాట నెలకొన్న రాజకీయ శూన్యతను క్యాష్ చేసుకోవాలని చాలా పార్టీలు, సినిమా రంగానికి చెందిన ప్రముఖులు కూడా తమదైన శైలి యత్నాలు చేశారు. అయితే ఈ తరహా యత్నాలను రజనీ అందరి కంటే ముందే ప్రారంభించారని చెప్పాలి. అసలు జయ, కరుణల మరణాల కంటే ముందుగానే రజినీ రాజకీయంగా అడుగులు వేశారనే చెప్పాలి. ఆ తర్వాత ఆ ఇద్దరు నేతల మరణంతో రజినీ మరింత స్పీడు పెంచుతారని అంతా భావించారు. ఆ భావనలు నిజమేనన్నట్లుగా రజినీ రజినీ మక్కల్ మండ్రం పేరిట రాజకీయ పార్టీని ప్రకటించారు. పార్టీ గుర్తును కూడా ప్రకటించారు. ఆ తర్వాత పలుమార్లు తన అభిమానులతో వరుస భేటీలు నిర్వహించిన రజినీ.. ఎందుకనో గానీ ఉన్నట్టుండి తన స్పీడును తగ్గించారు. మొన్నటి ఎన్నికల్లో రజినీ పార్టీ పోటి చేస్తుందనుకున్నా రజినీ ఆ దిశగా సాగలేదు. అంతకుముందు జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఆయన ఇదే మంత్రాన్ని పాటించారు. ఈ క్రమంలో రాజకీయాల నుంచి రజినీ తప్పుకుంటారన్న వాదనలూ వినిపించాయి. అనుకున్నట్లుగానే సోమవారం రజినీ సంచలన ప్రకటన చేశారు. రాజకీయ పార్టీని రద్దు చేస్తూ సేవా కార్యక్రమాల కోసం ప్రత్యేక సంస్థను ప్రకటించారు.
నాన్ లోకల్ భయమే వెనక్కు నెట్టిందా?
తమిళనాట సూపర్ స్టార్ గా ఎదిగిన రజినీ వాస్తవంగా కర్ణాటకకు చెందిన వ్యక్తి. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాకే ఆయన తమిళనాడు వాసిగా మారిపోయారు. మొత్తంగా తమిళ తంబీలు ఇప్పటికీ రజినీని కన్నడిగుడిగానే భావిస్తారు. రాజకీయంగా రజినీ ఎంట్రీ ఇస్తున్న సమయంలోనూ తమిళ పార్టీలన్ని రజినీ నాన్ లోకల్ విషయాన్ని పదే పదే గుర్తు చేశాయి. జయ, కరుణల మరణం తర్వాత రాష్ట్రంలో బలోపేతం అవుతామని భావించిన బీజేపీకి భంగపాటు ఎదురయ్యే సరికి రజినీ పునరాలోచనలో పడినట్టుగా వార్తలు వినిపించాయి. తాజాగా ఆయన తన రాజకీయ పార్టీని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించడంతో ఇదే వాదన నిజమన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా తమిళ రాజకీయాల్లో దివంగత నేలు ఎంజీఆర్, జయలలిత మాదిరిగా తనదైన శైలిలో చక్రం తిప్పుదామని స్పీడు చూపిన రజినీ.. ఈ అంశాలన్నింటినీ బేరీజు వేసుకుని పార్టీని పురిట్టోనే చంపేసిన వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది.
Must Read ;- సూపర్ స్టార్ రజనీకాంత్ కు దాదా సాహెబ్ పాల్కే అవార్డు