High Court Hearing On PR Mohan Petition After His Death :
నిజమే.. టీడీపీకి చెందిన సీనియర్ నేత, శాప్ మాజీ చైర్మన్ పీఆర్ మోమన్ తాను మరణించినా కూడా టీడీపీ తరఫున ఆయన చేపట్టిన పోరాటం మాత్రం ఆగిపోలేదు. కరోనా నియంత్రణ, వైద్య చికిత్సలు అందజేత, అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటు తదితరాలపై జగన్ సర్కారు అవలంబించిన నిర్లక్ష్యంపై పీఆర్ మోహన్ తనదైన శైలి పోరాటాన్ని ప్రారంభించారు. సోమవారం ఆయన కన్నుమూశారు. అయినా కూడా ఆయన టీడీపీ తరఫున చేపట్టిన పోరాటం మాత్రం ఆగిపోలేదు. హైకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం విచారణ జరగగా.. జగన్ సర్కారు తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తంగా పీఆర్ మోహన్ దాఖలు చేసిన పిటిషన్ పై ఆయన మరణం తర్వాత విచారణ జరగడం, జగన్ సర్కారుకు హైకోర్టు మొట్టికాయలు వేయడం ఆసక్తి రేకెత్తిస్తోంది.
రుయాలో ఏం జరిగిందంటే..?
కరోనా విజృంభణ నేపథ్యంలో వైరస్ బాధితులకు ఎక్కడికక్కడ చికిత్స అందించే క్రమంలో జగన్ సర్కారు ఘోరంగా విఫలమైందన్న వార్తలు వినిపించాయి. తొలి వేవ్ లో ఎలాగోలా నెట్టుకొచ్చిన జగన్ సర్కారు.. సెకండ్ వేవ్ లో బాధితులకు అవసరమైన ఆక్సిజన్ ను కూడా అందించలేక నానా పాట్లు పడింది. అయితే ఆక్సిజన్ అందుబాటులో ఉన్న చోట్ల కూడా సర్కారు నిర్లక్ష్యం కారణంగా వందలాది మంది కరోనా రోగులు మృత్యువాత పడ్డారు. ఇలాంటి ఘటనల్లో చిత్తూరు జిల్లా తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక చాలా మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ మరణాల సంఖ్యను తక్కువగా చూపే యత్నం చేసిన జగన్ సర్కారు,. తొలుత 11 మందే చనిపోయారని ప్రకటించి. ఆ తర్వాత టీడీపీ నిరసనలతో 23 మంది చనిపోయినట్టు ఒప్పుకుంది. వాస్తవానికి 23 మంది కంటే కూడా మరింత మంది ప్రాణాలు కోల్పోయారన్న వాదనలు వినిపించాయి. వాస్తవానికి రుయాలో ఆక్సిజన్ సౌకర్యం అందుబాటులో ఉంది. అయితే ఆక్సిజన్ నిల్వలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించిన కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పాలి.
పీఆర్ మోహన్ పిటిషన్ పై విచారణ
రాష్ట్రవ్యాప్తంగా పెను కలకం రేపిన ఈ ఘటనపై టీడీపీ సీనియర్ నేత పీఆర్ మోహన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఘటనకు బాధ్యులెవరో తేల్చి.. వారిపై కఠినంగా శిక్షించాలని ఆయన తన పిటిషన్ లో కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్ మంగళవారం విచారణకు రాగా.. సోమవారమే పీఆర్ మోహన్ కన్నుమూశారు. అయినా పీఆర్ మోహన్ తరఫున ఆయన తరఫు న్యాయవాది యలమంజుల బాలాజీ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆక్సిజన్ సరఫరాదారు నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన చోటుచేసుకుందని కలెక్టర్ రూపొందించిన నివేదికను ప్రభుత్వం కోర్టుకు సమర్పించింది. అయితే మీరెందుకు కౌంటర్ దాఖలు చేయలేదని కోర్టు. రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాదిని నిలదీసింది. ఇలాంటి విషయాల్లోనూ కౌంటర్ దాఖలులో జాప్యమేనా అని నిలదీసింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వం బదులిచ్చింది. మొత్తంగా పీఆర్ మోహన్ మరణించినా.. టీడీపీ తరఫున జగన్ సర్కారుపై ఆయన పోరాటం మాత్రం కొనసాగిందన్న కోణంలో ఆసక్తికర విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Must Read ;- చంద్రబాబుకు ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత?