ఒక హీరోకి గుండెల్లో గుడి కట్టడం ఎక్కడైనా చూశారా? తమ గుండె గుడిలో కొలువుదీరిన రామన్నను దర్శనం చేసుకోవాలని తపించిపోయిన తెలుగువాడు ఉండడంటే అతిశయోక్తి కాబోదు. ఆయనే ఆంధ్రుల ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు. 1960లో ‘శ్రీవేంకటేశ్వర మహత్యం’ సినిమాలో వేంకటేశ్వరుడిగా నందమూరి తారక రామారావు నటించినప్పటి నుంచే ఆయన ఆంధ్రుల ఆరాధ్య దైవంగా మారిపోయారు.
అక్కడ వెంకన్న.. ఇక్కడ రామన్న అనేలా పరిస్థితి తయారైంది. తిరుపతిలో వేంకటేశ్వరుడిని దర్శించుకోడానికి వచ్చిన భక్తులు అట్నుంచి చెన్నై వెళ్లి తారక రాముడిని దర్శించుకుంటేనేగాని సంతృప్తి పడేవారు కాదు. తిరుపతి వెంకన్న దర్శనం తర్వాత నేరుగా మద్రాస్ వెళ్లి తెల్లవారుజామునే అన్న ఎన్టీఆర్ దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా మారింది. ఆ తర్వాతే తమ సొంతూళ్లకు చేరుకునేవారు. మరే హీరోకీ ఇలాంటి భాగ్యం దక్కలేదు.
బజుల్లా రోడ్డులో జనమే జనం
మద్రాసులోని బజుల్లా రోడ్డు ఎప్పుడూ జనసందోహంతో ఉండేది. దానికి కారణం అక్కడ ఉన్న ఎన్.టి. రామారావు ఇల్లు. ఆ ఇంటి ముందు ప్రతి రోజూ ఉదయం టూరిస్టు బస్సులు ఆగి ఉండేవి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మద్రాసు వచ్చే వెళ్లే యాత్రికులు ఎన్టీఆర్ ను చూడ్డానికే అక్కడికి వచ్చేవారు. భోరున వర్షం కురుస్తున్నా అభిమానులు ఆ ఇంటి ముందే నిలబడి ఉండేవారు. ఉదయం ఐదున్నర నుంచి ఎనిమిది గంటల మధ్య యాత్రికుల తాకిడి ఎక్కువగా ఉండేది. ఆ సమయంలో ఎన్టీఆర్ వారి దగ్గరికి వచ్చి వారిని ఆప్యాయంగా పలకరించే వారు.
కుశల ప్రశ్నలు అడిగేవారు. వారి కోసం తన విలువైన సమాయాన్ని కేటాయించేవారు. వారితో మాట్లాడిన తర్వాతే షూటింగు కోసం స్టూడియోలకు వెళ్లేవారు. దాంతో ఆ ఎన్టీఆర్ నివాసం రెండో తిరుపతిగా ప్రసిద్ది చెందింది. ఈ ప్రపంచంలో ఎంతోమంది నటీనటులున్నారు. మరెంతో మంది రాజకీయ నాయకులు ఉన్నారు. కానీ ఇంతటి గౌరవమర్యాదలు దక్కిన వారు ఇంకెవరూ లేరు. గౌరవమర్యాదలు అనడం కన్నా దేవుడిలా కొలవడం అంటేనే బాగుంటుందేమో. అందుకే ఆయన యుగపురుషుడయ్యారు.
Must read ;- శతజయంతి దిశగా ఎన్టీఆర్ మహానట ప్రస్థానం











