సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు నేలకు చెందిన జస్టిస్ నూతలపాటి వెంకటరమణ పదవీ బాధ్యతలు చేపట్టాక.. కోర్టు విచారణల్లో బృహత్తర మార్పు వచ్చిందనే చెప్పాలి. గతంలో ఎంతమంది ప్రధాన న్యాయమూర్తులు వచ్చినా.. కనిపించని ఈ మార్పు జస్టిస్ ఎన్వీ రమణ చొరవ వల్లే సాధ్యమైందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మధ్యవర్తిత్వం.. ఈ పదం చూడ్డానికి, సలహా ఇవ్వడానికి చాలా చిన్నగానే కనిపించినా.. దీనిని అమలు చేస్తే.. న్యాయ వ్యవస్థలో గొప్ప మార్పు వస్తుంది. ఈ విషయం అందరికీ తెలిసినా.. మధ్యవర్తిత్వాన్ని అమలయ్యేలా చర్యలు చేపట్టాలని చాలా మందే చెప్పినా.. వారు మాత్రం దానిని ఆచరణలో పెట్టిన దాఖలా లేదనే చెప్పాలి. అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మధ్యవర్తిత్వానికి ఎలనేని ప్రాధాన్యం దక్కింది. ఇతరుల మాదిరిగా ఏదో అలా మధ్యవర్తిత్వంపై దృష్టి పెట్టండి అని లెక్చర్లు ఇచ్చేసి.. జస్టిస్ రమణ దానిని వదిలేయలేదు. మధ్యవర్తిత్వాన్ని ఎలా అమలు చేయాలో, కక్షిదారులను ఎలా దాని వైపు పయనించేలా చేయాలో జస్టిస్ ఎన్వీ రమణ ప్రత్యక్షంగా చేసి చూపిస్తున్నారు. ఇటీవల తెలుగు నేలకు చెందిన భార్యాభర్తలను తనదైన మధ్యవర్తిత్వం మాటలతో జస్టిస్ ఎన్వీ రమణ కలిపిన వైనం నిజంగానే అద్భుతమని చెప్పాలి. ఇలాంటి తరుణంలో తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి పంచాయతీపైనా జస్టిస్ ఎన్వీ రమణ అదే మంత్రాన్ని పాటించారు. దాని ఫలితం ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంది.
కృష్ణా జలాలపై పంచాయతీ
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదిరి పాకాన పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఈఆర్ఎంబీ)కి ఇరు రాష్ట్రాలు ఫిర్యాదుల మీదు పిర్యాదులు చేసుకున్న సంగతి తెలిసిందే. అక్కడ పరిష్కారం లభించడం ఆలస్యం కావడంతో ఇరు రాష్ట్రాలు కోర్టులను కూడా ఆశ్రయించాయి. ఇందులో భాగంగా కృష్ణా జలాలకు సంబంధించి తెలంగాణతో రేకెత్తిన వివాదంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. శ్రీశైలం ప్రాజెక్టుకు నిర్దేశిత నీటి మట్టం చేరకముందే తెలంగాణ విద్యుదుత్పాదన జరుపుతోందని, దీనిని ఆపాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న ఏపీ.. కృష్ణా జలాలపై నెలకొన్న వివాదంపై జోక్యం చేసుకోవాలని, వివాదాన్ని పరిష్కరించే దిశగా ఆదేశాలు జారీ చేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ సోమవారం నాడు జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా తెలంగాణ తనదైన శైలి వాదనలు వినిపించింది. అసలు ఏపీ పిటిషన్ ను విచారణకు స్వీకరించరాదంటూ తెలంగాణ సుప్రీంను కోరింది.
జస్టిస్ ఎన్వీ రమణ ఏమన్నారంటే..?
ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ ఇరు వర్గాల వాదనలను ఓపిగ్గా విన్న తర్వాత.. తనదైన మంత్రాన్ని బయటకు తీశారు. కృష్ణా జలాలకు సంబంధించిన వివాదాలపై ఇరు రాష్ట్రాలు మధ్యవర్తిత్వం ద్వారా చర్చలు జరుపుకుని పరిష్కరించుకునే దిశగా ఆలోచన చేయండి అంటూ ఓ ఆసక్తికర సలహా ఇచ్చారు. ఇరు రాష్ట్రాల తరఫున విచారణకు హాజరైన సీనియర్ న్యాయవాదులను ఉద్దేశించి జస్టిస్ ఎన్వీ రమణ మరింత కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యవర్తిత్వం ద్వారా ఈ సమస్యను ఇరు రాష్ట్రాలు పరిష్కరించుకునే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు తెలియజేయాలని, మధ్యవర్తిత్వం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకునేలా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను ప్రోత్సహించాలని కూడా ఆయన న్యాయవాదులకు సూచించారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు మధ్యవర్తిత్వాన్ని గుర్తు చేసి.. దానిపై ఆయా రాష్ట్రాల అభిప్రాయమేమిటో తెలపాలని ఆదేశాలు జారీ చేశారు.తాను ఇరు రాష్ట్రాలకు చెందిన వ్యక్తినని, ఈ పిటిషన్ విచారణ అనివార్యమైతే.. వేరే బెంచ్ కు పిటిషన్ ను బదిలీ చేస్తానని చెప్పారు. ఇరు రాష్ట్రాల మధ్య మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కారమయ్యేలా చూడాలని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించిన వెంటనే కోర్టు హాలులో ఉన్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. మరి జస్టిస్ ఎన్వీ రమణ సూచన మేరకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకుంటాయో, లేదంటే విచారణకే పట్టుబడతాయో చూడాలి.
Must Read ;- ఏపీ సీఎం జగన్ ఇక మాజీనే