ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమంలో ఏపీలోని అధికార పార్టీ ఇప్పుడిప్పుడే మేల్కొన్నట్లుగా కనిపిస్తోంది. మొన్నటిదాకా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు తాము కూడా వ్యతిరేకమేనని, అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని చెప్పడంతోనే సరిపెట్టిన వైసీపీ.. ఉక్కు పరిరక్షణ కోసం సాగుతున్న ఉద్యమాలకు అసలు మద్దతు పలికిన పాపానే పోలేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ విషయంలో ఆది నుంచి కూడా బాధ్యత కలిగిన విపక్షంగా టీడీపీ మాత్రం విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి నేతృత్వం వహిస్తోంది. అటు విశాఖలోనే కాకుండా ఎక్కడ ఉక్కు పరిరక్షణ ఉద్యమం జరిగినా.. టీడీపీ వెన్నంటే సాగుతోంది. కొన్ని సందర్భాల్లో తానే ముందుండి నిసనలు చేపట్టి.. ఉక్కు కార్మికులకు మరింత భరోసాను నింపుతోంది. ఈ తరహాలో ఇప్పటిదాకా వైసీపీ నడవలేదనే చెప్పాలి.
హస్తినకు చేరిన ఉక్కు ఆందోళనలు
పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవుతున్నాయన్న సందర్భంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అప్పుడే మొదలైనట్లుగా గళం సవరించుకున్న వైసీపీ.. పార్లమెంటులో ఓ రేంజిలో నిరసనలకు తెర తీసింది. బయట ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం సాగుతున్న ఉద్యమాల్లో మాత్రం ఆ పార్టీ నేతలు గానీ, కార్యకర్తలు గానీ పెద్దగా కనిపించలేదు. అయితే ఇప్పుడు ఉక్కు పరిరక్షణ ఉద్యమం విశాఖను, ఏపీని దాటి దేశ రాజధాని హస్తినకు చేరింది. విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆందోళనలు సోమవారం ఢిల్లీని తాకాయి. ఈ నిరసనలకు ఎప్పటిలానే టీడీపీ ముందుండి నడిపించింది. టీడీపీకి చెందిన విశాఖ జిల్లా నేతలు బండారు సత్యనారాయణ మూర్తి, పల్లా శ్రీనివాసరావులతో పాటు పలువురు టీడీపీ నేతలు ఢిల్లీకి వెళ్లి మరీ నిరసనల్లో పాలుపంచుకున్నారు. వీరితో పాటు సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ కూడా ఆ నిరసనల్లో పాల్గొన్నారు. ఓ వైపు పార్లమెంటులో నిరసన హోరును వినిపిస్తున్న వైసీపీ.. ఈ నిరసనల్లోనూ పాలుపంచుకుంది.
అదీప్ రాజు ఒక్కరే..
విశాఖ జిల్లా పెందుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వైసీపీ నేత అదీప్ రాజు ఢిల్లీలో సోమవారం మొదలైన విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమంలో ప్రత్యక్షంగానే పాలుపంచుకున్నారు. అదీప్ రాజుతో పాటు కొందరు వైసీపీ కార్యకర్తలు కూడా ఈ నిరసనల్లో కనిపించారు. ఆ తర్వాత వైసీపీ ఎంపీలు కూడా ఈ నిరసనలకు మద్దతు పలికారు. ఏదో ఢిల్లీలో ఉన్నాం కదా అన్న భావనతోనే వారు ఈ నిరసనలకు మద్దతు పలికారన్న వాదనలే వినిపిస్తున్నాయి తప్పించి.. అదీప్ రాజు మినహా ప్రత్యేకంగా ఈ నిరసనలకు మద్దతు తెలిపేందుకు ఢిల్లీకి వచ్చిన వైసీపీ నేతలు ఎవరూ లేరన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయినా ఆంధ్రుల హక్కుగా ఉన్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు టీడీపీ మొదలెట్టిన నిరసనలకు పార్టీలకు అతీతంగా మద్దతు పలకాల్సిన అవసరాన్ని అదీప్ రాజు గుర్తించినట్లుగా మిగిలిన వైసీపీ నేతలు గానీ.. ఆ పార్టీ అధిష్ఠానం గానీ ఎప్పుడు గుర్తిస్తుందో చూడాలి. అయితే ఢిల్లీలో సోమవారం మొదలైన ఉక్కు పరిరక్షణ ఉద్యమంలో టీడీపీతో పాటు వైసీపీ కూడా కనిపించిన వైనాన్ని స్వాగతిస్తున్న ఏపీ జనం.. ఇది కదా మనకు కావాల్సింది అన్న వ్యాఖ్యలు చేస్తున్నారు.
Must Read ;- ఫలించిన టీడీపీ పోరు!.. ‘బాక్సైట్’ బద్దలే!