తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను కేంద్రం నియమించింది. ఏపీ హైకోర్టుకు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, తెలంగాణ హైకోర్టుకు సతీశ్ చంద్ర శర్మలను నియమిస్తూ శుక్రవారం కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కోలీజియం చేసిన సిఫారసులను ఆమోదం కోసం కేంద్రం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు పంపింది. రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆమోద ముద్ర పడగానే.. ఈ నియామకాలు అమల్లోకి రానున్నాయి.
జస్టిస్ హిమా స్థానంలో జస్టిస్ సతీశ్
మొన్నటిదాకా తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగిన జస్టిస్ హిమా కోహ్లీ ఇటీవలే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. కేంద్రం నుంచి ఆదేశాలు రాగానే.. జస్టిస్ కోహ్లీ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ బాధ్యతల నుంచి రిలీవ్ అయి సుప్రీంకోర్టుకు వెళ్లిపోయారు. కొత్త ప్రధాన న్యాయమూర్తి నియామకం జరిగేదాకా తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రామచంద్రరావును ఇంచార్జీ సీజేగా నియమించారు. తాజాగా తెలంగాణ హైకోర్టు సీజేగా సతీశ్ చంద్ర శర్మ నియామకం కావడంతో త్వరలోనే ఆయన జస్టిస్ రామచంద్రరావును నుంచి సీజేగా బాధ్యతలు స్వీకరిస్తారు.
ఛత్తీస్‌గఢ్ సీజేగా గోస్వామి
ప్రస్తుతం ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్న ఏకే గోస్వామిని తాజాగా ఛత్తీస్‌గఢ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను ఏపీ హైకోర్టు సీజేగా బదిలీ చేశారు. అంటే.. ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ గోస్వామి స్థానాన్ని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సీజేతో భర్తీ చేస్తూ.. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా బదిలీతో ఖాళీ అవుతున్న స్థానాన్ని జస్టిస్ గోస్వామితో భర్తీ చేస్తున్నారన్న మాట.
Must Read ;- జస్టిస్ కనగరాజ్ తట్టాబుట్టా సర్దాల్సిందే