పై ఫొటో చూశారా?. అందులో ఉన్న సెలబ్రిటీ పేరు చెప్పక్కర్లేదు కదా. ముందు సినిమాల్లో సత్తా చాటి.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఆదిలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నా.. ఆ తర్వాత పొలిటీషియన్ గా, వైసీపీ ఎమ్మెల్యేగా సత్తా చాటుతున్న చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇలా బడిలో బోర్డుపై అక్షరాలు రాస్తున్నారేమిటా? అని ఆశ్చర్యపోతున్నారా? అంత ఆశ్చర్యపోవాల్సిన పనేమీ లేదు. ఎందుకంటే.. ఒక్క రాజకీయ రంగంలో అదృష్టం కలిసి వస్తేనే వింతలు విడ్డూరాలకు దిగుతున్న మన నేతాశ్రీలను చూస్తున్నాం కదా. అలాంటిది అటు తళుకుబెళుకుల సినిమా రంగంతో ఇటు రాజకీయ రంగంలోనూ సత్తా చాటిన రోజా ఈ మాత్రం తరగతి గదిలో కనిపిస్తే ఆశ్చర్యపోవాల్సింది ఏముంది?
ఈ ఫొటో నేపథ్యమేంటంటే..?
ఏపీలో జగన్ సర్కారు నాడు-నేడు పేరిట ప్రభుత్వ స్కూళ్లను బాగు చేసే కార్యక్రమాన్ని చేపట్టింది కదా. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో మరమ్మతులు, కొత్త నిర్మాణాల పేరిట హడావిడి చేస్తోంది కదా. అందులో భాగంగా చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా నియోజకవర్గంలోనూ ఈ పనులు సాగుతున్నాయి. శుక్రవారం నాడు తన నియోజకవర్గ పరిధిలోని పుత్తూరు రూరల్ మండలం తిరుమల కుప్పం దళితవాడలో నాడు- నేడు పథకం కింద రూ.17.72 లక్షల వ్యయంతో ఆధునీకరించి న మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను రోజా ప్రారంభించారు. ఇందులో భాగంగానే తరగతి గదిని ప్రారంభించిన ఆమె.. బోర్డుపై ‘‘చదువు చదివించు’’ అనే అక్షరాలు రాసి మురిసిపోయారు. అప్పుడు తీసిన ఫొటోనే ఇది. ఈ కార్యక్రమంలో ఆధునీకరించిన తరగతి గదులను ప్రారంభించిన ఆమె.. ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించారు, జగనన్న విద్యా కానుకను కూడా విద్యార్థులకు అందజేశారట.
Must read ;- జగన్ అసమర్ధతకు సాక్ష్యం వేదాద్రి ఎత్తిపోతల











