Supreme Court Allows Vinayakas Immersion In Hussain Sagar :
భాగ్యనగరి ప్రజలు నిజంగానే హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. రోజుల తరబడి కొనసాగుతున్న వారిలోని టెన్షన్ కు గురువారం ఉదయం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుతో చెక్ పడిపోయింది. వినాయక నిమజ్జనాన్ని ఈ దఫా హుస్సేన్ సాగర్ లో అనుమతించేది లేదంటూ తెలంగాణ హైకోర్టు చెప్పినప్పటి నుంచి భాగ్యనగరి జనం.. మరి నిమజ్జనాన్ని నిర్వహించేదెలా అన్న దిశగా ఆందోళనలో కూరుకుపోయింది. ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకున్న కేసీఆర్ సర్కారు.. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. మూడు రోజుల క్రితం ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం గురువారం ఉదయం విచారణ చేపట్టింది. ఆ వెంటనే ప్రజల మనోభావాలకు అనుగుణంగానే తీర్పు చెప్పింది.
ఇదే చివరిసారి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించింది. తెలంగాణ ప్రభుత్వ వాదన విన్న జస్టిస్ ఎన్వీ రమణ.. ఈ ఏడాది ఎప్పటిలాగే హుస్సేన్ సాగర్ లోనే వినాయక నిమజ్జనానికి అనుమతి ఇస్తున్నట్లుగా సంచలన తీర్పు చెప్పారు. అయితే ఈ తీర్పులో జస్టిస్ ఎన్వీ రమణ కొన్ని కండీషన్లను పెట్టారు. ఈ ఏడాదికి మాత్రమే హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి అనుమతి ఇస్తున్నట్లుగా చెప్పారు. వచ్చే ఏడాది మాత్రం హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం కుదరదని తేల్చేశారు. అంతేకాకుండా ఈ ఏడాది నిమజ్జనానికి కూడా మోడ్రన్ క్రేన్లను వినియోగించడంతో పాటుగా నిమజ్జనం ముగిసిన వెంటనే వాటిని తొలగించారని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది నిమజ్జనానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు సమగ్ర నివేదిక సమర్పించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుని నిమజ్జనాన్ని నిర్వహించాలని జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు.
మరి వచ్చే ఏడాది ఎలా?
హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి ఈ ఏడాదే ఆఖరు. ఇదే విషయాన్ని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం తేల్చేసింది. అసలు హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం అంటేనే.. హుస్సేన్ సాగరే గుర్తుకు వస్తుంది. రోజుల తరబడి సాగే నిమజ్జనంతో హుస్సేన్ సాగర్ ఓ జాతరనే తలపిస్తుంది. అలాంటిది ఈ ఏడాది నిమజ్జనం మాత్రమే హుస్సేన్ సాగర్ లో నిర్వహించేలా సుప్రీంకోర్టు తీర్పు చెబితే.. మరి వచ్చే ఏడాది పరిస్థితి ఏమిటి? హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం వద్దన్న హైకోర్టు తీర్పుపై ఇప్పటికే భాగ్యనగరి ప్రజలు విలవిల్లాడిపోయారు. ఎలాగైనా కోర్టును ఒప్పించి హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం చేయాలని, అలా జరిగేలా చూడాలని కేసీఆర్ సర్కారుకు పెద్ద ఎత్తున వినతులు వెళ్లాయి. అయితే హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం ఈ ఏడాది వరకే పరిమితం. ఇదే ఆఖరు.. అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో హైదరాబాద్ జనం.. ఈ ఏడాదికి అవకాశం చిక్కినందుకు సంతోషపడాలో, వచ్చే ఏడాది నుంచి ఈ వేడుక కళ తప్పనుందని బాధపడాలతో తెలియక అయోమయంలో పడిపోయారు.
Must Read ;- కమాన్ బండి.. కేటీఆర్ రిజైన్ చేస్తారట