ప్రైవేట్ టీచర్ల బాధలు గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం వారికీ ఆర్ధిక సాయం అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అర్హుల జాబితా తయారు చేసింది. కరోనా సమయంలో పాఠశాలలు మూతపడటంతో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలో మొత్తం 1,18,004 మంది ప్రైవేట్ స్కూల్స్‌లో పనిచేసే టీచర్లు, బోధనేతర సిబ్బంది ఉన్నారు. వీరిలో 1,06,383 మంది టీచర్లు కాగా, 11,621 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు. వీరి సంఖ్య మరో 10వేల వరకు పెరిగే అవకాశం ఉంది. ఎంపిక చేసిన వారికి మంగళవారం నుంచి రూ.2వేల నగదు వారి వారి అకౌంట్లలో జమచేయనున్నారు. ఇక ఈ నెల 21 నుంచి 25 మధ్య 25 కేజీల బియ్యం అందించనున్నారు.
తుది జాబితా విడుదల
గత వారం ప్రారంభమైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఆదివారానికి ముగిసింది. రాష్ట్రంలోని 33 కలెక్టర్ కార్యాలయాలకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అధికారులు ఆదివారం తుది జాబితాను విడుదల చేశారు. సోమవారం ఈ జాబితాను ఆర్థికశాఖకు పంపించనున్నారు. నగదు సాయం కోసం ఇప్పటికే విద్యాశాఖ రూ.32 కోట్లు మంజూరు చేయగా, పౌరసరఫరాల శాఖ 3.625 టన్నుల సన్నబియ్యాన్ని సిద్ధం చేసింది. సీఎం కేసీఆర్ ఆర్ధిక సాయం గురించి మాట్లాడిన వెంటనే అధికారులు దరఖాస్తులు తీసుకోవడం ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దీనికి సంబందించిన ప్రక్రియ మొత్తం జరిగింది. మొత్తం 2,06,345 దరఖాస్తులు రాగా, వాటిని వడబోసిన అధికారులు జిల్లాల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరిలో బోధనా సిబ్బంది 1,53,525మంది, బోధనేతర సిబ్బంది 52,820 మంది ఉన్నారు. లబ్ధిదారుల జాబితాను https:/schooledu.telangana.gov. in లో ఉంచారు. ఈ జాబితాను లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ల ఆధారంగా చూసుకునే అవకాశం కల్పించారు.
Must Read ;- తెలంగాణ కోసం పదవులను వదిలిపెట్టిన చరిత్ర టీఆర్‌ఎస్‌ది.. హాలియా సభలో కేసీఆర్