రాజకీయాల్లో పొత్తులు, ఎత్తులు మామూలే! కానీ ఈ పొత్తులు రకరకాలుగా ఉంటాయి. కొన్ని పార్టీలు మరొక పార్టీతో పొత్తులు బహిరంగంగానే పెట్టుకుంటే మరికొన్ని పార్టీలు మాత్రం తమ మధ్య ఉన్న పొత్తును బయటపడకుండా అంతర్గతంగా పెట్టుకుంటాయి. ఎందుకంటే ఈ పొత్తుల వ్యవహారం కొన్నిసార్లు లాభం చేకూరుస్తోంది. మరొకొన్ని సార్లు బెడిసికొడుతోంది. పార్టీ సిద్ధాంతాలు వేరైనా కేవలం సీట్ల సిద్ధాంతాలనే నమ్ముకుని ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయి. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఎంఐఎం పార్టీ పొత్తు విషయంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జీహెచ్ఎంసీ ఎన్నికలకు డిసెంబర్ 1న పోలింగ్ జరగనుంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల హడావుడిలో నిమగ్నమై తమ పార్టీ గెలుపుకు కృషి చేస్తున్నాయి. ఈక్రమంలోనే ఈ రోజు మంత్రి కేటీఆర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అందులో ఎంఐఎం పార్టీతో పొత్తు అంశంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం పార్టీతో తమకు ఎలాంటి పొత్తులేదని, ఉండబోదు కూడా అని తేల్చేశారు. అలాగే ఈ సారి పాతబస్తీలోని 50 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీలో నిలుస్తున్నారని చెప్పారు. 2016 ఎన్నికల్లో పాతబస్తీ నుంచి 5గురు అభ్యర్థులు గెలిచారని, ఈ సారి అక్కడి నుంచి 10 స్థానాలను గెలుచుకుంటామనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. కేటీఆర్ నోట ఈ మాటలు రావడం రాజకీయంగా పలు చర్చలకు దారితీసింది. ఎంఐఎంతో టీఆర్ఎస్‌కు మంచి దోస్తీ ఉందనే విషయం అందరికీ తెలిసిన విషయమే. ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ, ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య ఉన్న సాన్నిహిత్యం కూడా రాజకీయ పార్టీ నేతలకు, రాష్ట్ర ప్రజలకు తెలిసిందే. అసెంబ్లీ లోపల, బయట ఈ రెండు పార్టీల దోస్తీ ఎవ్వరికీ తెలియింది కాదనే చర్చ కూడా ఉంది. మరీ అలాంటిది కేటీఆర్ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడంపై పలురకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మన ముందు వీరు పొత్తులు లేవన్నట్లుగా ఇలానే ఉంటారు.. కానీ మన వెనుకాల మాత్రం కలిసే ఉంటారనే అభిప్రాయాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు.
ఆ వర్గం ఓట్ల కోసమేనా?..
పాతబస్తీ మినహా రాష్ట్రంలోని మైనార్టీ ఓట్లను తమ వైపు తిప్పుకోవాలంటే ఎంఐఎం పార్టీతో టీఆర్ఎస్‌కు దోస్తీ తప్పదనే భావన ఉంది. ఆ రెండు పార్టీలకు ఒకరితో మరొకరికి రాజకీయ అవసరం ఉందనే విషయం కూడా అందరికీ తెలిసిందే. బహిరంగంగా ఇద్దరూ ఎన్నడూ పొత్తు విషయం గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ తాజాగా మంత్రి కేటీఆర్ మాత్రం ఎంఐఎంతో తమకు ఎలాంటి పొత్తులు లేవని చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అంటే ఎంఐఎంతో తమకు పొత్తులేదని చెబుతూనే మరో వర్గం ఓట్లను బీజేపీ వైపు చీలిపోకుండా ఉండేందుకే ఈ విధమైన ప్రకటనను కేటీఆర్ చేసి ఉంటారా?. ఇప్పటికే బీజీపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్.. తమది హిందువుల పార్టీ అని, హిందువుల పరిరక్షణ కోసమే తమ పార్టీ పనిచేస్తుందని చెప్పిన విషయం తెలిసిందే. మైనారిటీల కోసం ఎంఐఎం పార్టీ పనిచేస్తున్నప్పుడు హిందువుల అభివృద్ధి కోసం బీజేపీ పార్టీ పనిచేస్తే తప్పేంటని కూడా టీఆర్ఎస్‌ను ప్రశ్నించారు. బండి సంజయ్ చేసిన ఈ ప్రకటన ఆ వర్గం ప్రజలపై ఎంతో కొంత ప్రభావం చూపకమానదు. ఈక్రమంలోనే ఆ వర్గం ఓట్లు ఎక్కడ బీజేపీ లాగేసుకుంటుందోనని కేటీఆర్ ఈ రకమైన కామెంట్స్ చేసి ఉంటారనే వాదన కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
Must Read ;- గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్‌కు 10 సీట్లేనట!!











