సీఎం కేసీఆర్ కు మోదీని వ్యతిరేకించే దమ్ము లేదని, అందుకే వ్యవసాయ చట్టాలకు వంత పాడుతున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. ‘ఈ సీఎంకి తన స్వార్థ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవన్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తానని ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.. ప్రధాని మోదీని కలిశాక చలి జ్వరంతో మంచాన పడ్డారని, అప్పటి నుంచి మోదీ పేరెత్తితే వణికి పోతున్నారని ఎద్దేవా చేశారు.’
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రేవంత్ చేపట్టిన రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర ఆదివారం 8వ రోజు రంగారెడ్డి జిల్లా కడ్తాల చేరుకుంది. అక్కడ బస్టాండ్ కూడలిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రైతులను పీడిస్తున్న మోదీ, కేసీఆర్ ప్రభుత్వాలను గద్దె దించేందుకు ప్రజలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతో వేలాది ఎకరాల రైతుల భూములను లాక్కుని బహుళజాతి కంపెనీలకు అమ్ముకుంటోందని, ప్రజలకు, భూమికి హాని కలిగించే ఫార్మాసిటీని అడ్డుకునేందుకు రైతుల పక్షాన కాంగ్రెస్ నిలుస్తుందని తెలిపారు. మంగళవారం రావిరాలలో నిర్వహించే పాదయాత్ర ముగింపు సభకు జెండాలు, ఎజెండాలు పక్కనపెట్టి ఒకేఒక్క రైతు ఎజెండాతో జనమంతా ఉప్పెనలా కదిలిరావాలని రేవంత్ పిలుపునిచ్చారు.
Must Read ;- లీడర్లకు షాక్..శ్రేణుల్లో జోష్: రేవంత్ రైతు భరోసా యాత్ర











