తెలంగాణలో ఇప్పుడు అటు అధికార పార్టీ టీఆర్ఎస్ అయినా.. ఇటు విపక్షాలు కాంగ్రెస్, బీజేపీలు అయినా హుజూరాబాద్ ఉప ఎన్నికలను బేస్ చేసుకునే కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి. ఏ కార్యక్రమం చేపట్టినా దాదాపుగా ఇదే తరహా ధోరణి కనిపిస్తోంది. విపక్షాలను మించి అధికార టీఆర్ఎస్ ఈ దిశగా వేస్తున్న ఎత్తులు, జిత్తులు ప్రజలను విస్మయానికి గురి చేస్తున్నాయని చెప్పాలి. సుధీర్ఘ కాలం పాటు టీడీపీలో కొనసాగిన మాజీ మంత్రి ఎల్.రమణ.. ఆ పార్టీకి ఇటీవలే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కేసీఆర్ తో భేటీ అయిన మరునాడు టీడీపీకి ఎల్.రమణ రాజీనామా ప్రకటించారు. ఆ తర్వాత ఈ నెల 12న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. రమణకు టీఆర్ఎస్ సభ్యత్వం ఇచ్చారు. అంటే.. ఆ రోజే ఎల్.రమణ అధికారికంగా టీఆర్ఎస్ లో చేరినట్టే లెక్క. అంటే.. ఈ నెల 12 నుంచి ఎల్.రమణ టీఆర్ఎస్ నేత కిందే లెక్క.
సభ్యత్వం తీసుకున్నాక కండువా
ఈ విషయం గుర్తుందో, లేదో తెలియదు గానీ.. శుక్రవారం (పార్టీ సభ్యత్వం ఇచ్చిన నాలుగు రోజుల తర్వాత) టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఎల్.రమణకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లుగా ప్రకటించారు. అంటే నాలుగు రోజుల క్రితమే పార్టీ సభ్యత్వం తీసుకున్న ఎల్.రమణను కేసీఆర్ నాలుగు రోజుల తర్వాత పార్టీలోకి ఆహ్వానించారన్న మాట. అయినా ఓ పార్టీ నేతగానో, కార్యకర్తగానో పరిగణించాలంటే.. పార్టీ కండువా కప్పుకున్న సందర్భాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారా? లేదంటే..పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకున్న సందర్భాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారా? అన్న దిశగా ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర లేసింది.
సభ్యత్వంతోనే పార్టీలో చేరినట్టు!
ఎక్కడైనా.. ఏ పార్టీలో అయినా పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న సందర్భాన్నే పార్టీలోకి చేరికగా పరిగణిస్తారు. చాలా రాజకీయ పార్టీలు తమ పార్టీలోకి ఏ నేత చేరినా.. బహిరంగ సభా వేదికగా కండువా కప్పేసి.. కార్యాలయంలో ప్రాథమిక సభ్యత్వం ఇస్తారు. కొన్ని పార్టీలు అయితే ఏకంగా రెండు కార్యక్రమాలను ఒకే వేదికపైనే నిర్వహిస్తాయి. అయితే టీఆర్ఎస్ లో మాత్రం కొత్తగా ముందు సభ్యత్వం ఇచ్చి.. ఆ తర్వాత పార్టీ కండువా కప్పే సంస్కృతి మొదలైందని చెప్పాలి. ఏది ఏమైనా.. హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ఎల్.రమణ పార్టీలోకి వచ్చిన వైనాన్ని టీఆర్ఎస్ ఇలా రెండు సార్లు ప్రచారం చేసుకోవడానికి వాడుకున్న వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది.
Must Read ;- టీడీపీని టీఆర్ఎస్ దాటేసిందట