మనీష్ మల్హోత్రా.. ఫ్యాషన్ డిజైనింగ్ ప్రపంచంలో మర్మోగే పేరిది. అతను రూపొందించిన దుస్తులు ధరించి హొయలొలికించిన బాలీవుడ్ తారలు ఎంతోమంది ఉన్నారు. అతని దృష్టి ఇప్పుడు సినిమా దర్శకత్వంపై పడింది. త్వరలోనే అతను మెగాఫోన్ చేతబట్టేందుకు సిద్దమవుతున్నాడు. బాలీవుడ్ లో అందమైన దుస్తులు కావాలంటే అందరూ మనీష్ పేరే కలవరిస్తారు. ఫ్యాషన్ ప్రపంచంలో దశాబ్దాల అనుభవం ఉన్న అతనికి దర్శకత్వంపై మోజు ఎందుకు కలిగిందోగానీ ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు.
అతను దర్శకత్వం వహించబోయేది ఎవరి చిత్రమో తెలుసా? ధర్మ ప్రొడక్షన్ చిత్రమది. ధర్మ ప్రొడక్షన్స్ అంటే బాలీవుడ్ దిగ్గజం కరణ్ జొహార్ ది. కరణ్ తో మనీష్ కు ఎప్పట్నుంచో మంచి స్నేహం ఉంది. ఈ సినిమా రొమాంటిక్ జోనర్ లో ఉంటుందని తెలుస్తోంది. మనీష్ సినిమా ప్రపంచంలోకి అడుగుపెడితే అది కచ్చితంగా కరణ్ సినిమాతో అవుతుంది. ఇద్దరిదీ అలాంటి స్నేహం మరి. వీరిద్దరూ కలిసి ఉమ్మడిగా చాలా ప్రాజెక్టులు చేపట్టారు. ముఖ్యంగా ఇద్దరికీ ఫ్యాషన్ ప్రపంచంతో మంచి అనుబంధం ఉంది.
కరణ్ జొహార్ సినిమాల్లోని నటుల అందానికి మనీష్ దుస్తులు కూడా కొంత కారణం. కరణ్ దర్శకత్వంలోని కుచ్ కుచ్ హోతా హైతో వీరి ప్రయాణం ప్రారంభమైంది. అప్పటినుంచి కబీ ఖుషి కబీ ఘమ్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, కళంక్ దాకా వీరి ప్రయాణం కలిసి సాగింది. తన డ్రీమ్ ప్రాజెక్టుకు సంబంధించిన కథ, స్క్రీన్ ప్లే అంతా తనే రాసుకుంటున్నాడట. ఇది చారిత్రక నేపథ్యంలో సాగే రొమాంటిక్ లవ్ అవుతుందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. దానికి కారణం ధర్మ బృందం ఓ చరిత్ర కారుడితో సంప్రదింపులు జరుపుతున్నారు.
శ్రీదేవి, జూహి చావ్లా, కరిష్మా కపూర్, కరీనా కపూర్ లాంటి అనేక మంది బాలీవుడ్ నటీమణుల స్టైల్ డిజైన్ విషయంలో మనీష్ దే కీలక పాత్ర. తనకున్న సినిమా ఆలోచనలను కరణ్ తో మనీష్ పంచుకున్నప్పుడు తనే దర్శకత్వం చేయాలన్న ఆలోచనను మనీష్ వ్యక్తపరిచాడు. ఆ కల ఇప్పటికి నెరవేరబోతోంది. ఇది చారిత్రక నేపథ్యంలో సాగే రొమాంటిక్ లవ్ స్టోరీ కాబట్టి ఇందులో కూడా దుస్తులకు ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుందట. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.
Must Read ;- చైతన్య లవ్ స్టోరీకి పది భారీ ఆఫర్స్ వచ్చాయా.?











