ఈ రోజు నుంచి తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారనున్నాయి. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ షర్మిల రంగంలోకి దిగుతున్నారు. షర్మిల పార్టీ ప్రకటన పాత అంశమే అయినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. టీపీసీపీ అధ్యక్షుడిగా నిన్న రేవంత్‌రెడ్డి ప్రమాణం,ఈ రోజు షర్మిల పార్టీ ప్రకటనతో ఇప్పటి వరకు టీఆర్‌ఎస్ VS బీజేపీగా అనుకున్న తెలంగాణ రాజకీయం రంజుగా మారనుంది. అన్ని పార్టీల వారు వచ్చే 27 నెలలూ తెలంగాణ వాసులను తమ హామీలతో ఉక్కిరి బిక్కిరి చేయనున్నారు.
నిన్న డుమ్మా.. ఈ రోజు శుభాకాంక్షలు
చివరి వరకు టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీపడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న గాంధీ భవన్‌లో జరిగిన రేవంత్‌రెడ్డి పదవీ ప్రమాణ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. రేవంత్‌ను టీపీసీసీ సారధిగా ప్రకటించగానే తానిక గాంధీభవన్ మెట్లు ఎక్కబోనంటూ కోమటిరెడ్డి ప్రకటించి సంచలన వ్యాఖ్యలు చేసి అధిష్టానం ప్రమేయంతో కొంత తగ్గారు. అయితే అన్న విధంగానే ఆయన నిన్న కార్యక్రమానికి హాజరు కాలేదు. అయితే, షర్మిల పార్టీ ప్రకటించనున్న జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఈ రోజు ఆగి వైఎస్సార్ అభిమానులతో ముచ్చటించారు. అంతే కాకుండా పార్టీ ఆవిర్భావ వేడుకకు రావాలని తనకు షర్మిల ఆహ్వానం పంపారని తెలిపారు. షర్మిల పార్టీకి కోమటిరెడ్డి ఆల్ ది బెస్ట్ అని కూడ చెప్పారు. వైఎస్ గొప్ప నేత అని కొనియాడి భువనగిరిలో ఆయనకు నివాళులు అర్పించేందుకు వెళ్తున్నట్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.
మొదటి నుంచి వైఎస్సార్ అనుచరుడే
కోమటిరెడ్డి తొలి నుండి వైఎస్సార్ అనుచరుడిగానే ఉన్నారు. 2009లో వైఎస్సార్ రెండో సారి అధికారంలోకి వచ్చినప్పుడు నల్గొండ జిల్లా నుండి జనారెడ్డిని సైతం పక్కన పెట్టి కోమటిరెడ్డికి క్యాబినెట్‌లో అవకాశం కల్పించారు. రాష్ట్ర విభజన తరువాత ఆయన తెలంగాణలో కోమటిరెడ్డి ఎప్పటికప్పుడు తన ప్రత్యేకత చాటుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గంతో పాటుగా, వైఎస్సార్ అభిమానుల మద్దతు తమ పార్టీకే ఉండే విధంగా షర్మిల ప్రయత్నాలు చేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గంతో పాటు కాంగ్రెస్‌లోని వైఎస్సార్ అభిమానులు తమకే మద్దతిస్తారని రేవంత్ అంటున్నారు. నల్గొండ జిల్లాలో బలమైన వర్గం ఉన్న కోమటిరెడ్డి ప్రస్తుతం సైలెంట్‌గా ఉంటున్నా తర్వాత రోజుల్లో ఆయన మద్దతు కీలకం కానుంది. రేవంత్‌కు పరోక్షంగా జలక్ ఇచ్చేందుకే షర్మిల పార్టీ ఆహ్వానం పంపినట్లు చెప్పటంతో పాటు షర్మిలకు ఆల్ ది బెస్ట్ చెప్పారనే విశ్లేషణలు సాగుతున్నాయి. కోమటిరెడ్డి అడగులు ఎటు పడతామన్నది రానున్న రోజుల్లో తేలనుంది.
Must Read ;- షర్మిల శ్రేయోభిలాషి జగనా? పవనా?










