ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం.. మహిళాభ్యున్నతిపై మన నేతలు వల్లె వేస్తున్న గంభీరమైన మాటలు. సగం వద్దులే. కనీసం పార్లమెంటులో ఎగువ సభ ఆమోదం తెలిపినట్లుగా… ప్రతిపాదిత బిల్లు చట్టంగా మారకున్నా.. 33 శాతం అవకాశాలైనా వారికి ఇవ్వాలి కదా. దిగువ సభ ఆమోదించలేదు కదా అని ఎంత తక్కువ సీట్లు వారికి ఇచ్చినా అడిగే నాథుడే లేడన్న ధీమాతో సాగుతున్నారా? ఏం జరుగుతోంది? మహిళలకు అన్యాయమే జరుగుతోంది? నమ్మడం లేదా? బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ విస్తరణను చూస్తే.. ఈ మాట నిజమేనని నమ్మక తప్పదు మరి. కొత్తగా 36 మంది మంత్రులను తన కేబినెట్ లోకి చేర్చుకున్న ప్రధాని మోదీ.. అందులో కేవలం ఏడు పదవులను మాత్రమే మహిళలకు కేటాయించారు. ఈ ఏగుడురి చేరికతో మోదీ కేబినెట్ లో మహిళా మంత్రుల సంఖ్య తొమ్మిదికి చేరగా.. మొత్తం కేబినెట్ సభ్యుల సంఖ్య 77లో ఈ సంఖ్య ఎంతశాతమన్నదే ఆసక్తి రేకెత్తిస్తోంది.
కొత్తగా 19 శాతం.. మొత్తంగా 11 శాతం..
అంకెలతో లెక్కిస్తే.. 77 మందితో ఉన్న మోదీ కేబినెట్ లో మహిళలు 9 మంది ఉంటే.. ఆ శాతం 11 శాతమే. అదే కొత్త మంత్రుల విషయానికి వస్తే.. 36 మందిలో ఏడుగురు మహిళలకు అవకాశం దక్కితే.. ఈ శాతం 19 శాతమే. అంటే.. ఏ లెక్కన చూసుకున్నా మహిళలకు దక్కాల్సినంత మేర పదవులు దక్కడం లేదనే చెప్పాలి. అది మోదీ అయినా, ఇటు జగన్ అయినా, అటు కేసీఆర్ అయినా మహిళల పట్ల ఒకే ఫార్ములాతో ముందుకు సాగుతున్నారు. అయితే తాజా మోదీ కేబినెట్ విస్తరణలో ఒకేసారి ఏడుగురు మంత్రులకు పదవులు దక్కడం ఆహ్వానించదగ్గ పరిణామామేనని చెప్పక తప్పదు.
9 మంది మహిళా మంత్రులు
మోదీ కేబినెట్ పునర్వవస్థీకరణలో భాగంగా బుధవారం కొత్తగా ఏడుగురు మహిళలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ జాబితాలో మీనాక్షి లేఖి, శోభ కరంద్లాజే, అన్నపూర్ణ దేవి, అనుప్రియ సింగ్ పటేల్, భారతి ప్రవీణ్ పవార్, ప్రతిమ భౌమిక్, దర్శన విక్రమ్ జర్దోశ్ ఉన్నారు. ఇక అప్పటికే మోదీ కేబినెట్ లో కొనసాగుతున్న ఇద్దరు మహిళా మంత్రులు నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీలతో కలిపితే మొత్తంగా మోదీ కేబినెట్ లో ఇప్పుడు మహిళా మంత్రుల సంఖ్య 9కి చేరింది. ఈ సంఖ్య మరింత పెరగాలని ఆశిద్దాం.
Must Read ;- అందరూ యమా స్పీడు మీదున్నారే











