KVP Ramachandra Rao Tributes To YS Rajasekhara Reddy In Gandhi Bhavan :
కేవీపీ రామచంద్రరావు అసలు కనిపించడమే లేదు. కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న ఆయన ఇప్పుడసలే కనిపించడం లేదు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆత్మీయ స్నేహితుడిగానే కాకుండా.. నిత్యం వెన్నంటే నడిచిన కేవీపీ.. వైఎస్ ఆత్మగా గుర్తింపు పొందారు. మొత్తంగా వైఎస్సార్, కేవీపీల స్నేహం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ వార్తాంశంగా నిలిచిందనే చెప్పాలి. వైఎస్సార్ మరణం తర్వాత ఆయన తనయుడు కాంగ్రెస్ పార్టీని వీడటం, వేరు కుంపటి పెట్టుకున్నా.. కేవీపీ మాత్రం కాంగ్రెస్ ను వీడలేదు. వెరసి వైఎస్ హయాంలో రాజ్యసభ సభ్యత్వం దక్కించుకున్న కేవీపీని కాంగ్రెస్ పార్టీ మరోమారు పెద్దల సభకు పంపి గౌరవించింది. మొత్తంగా ఇప్పుడు ఆయన ఎంపీగా పార్లమెంటులో కొనసాగుతున్నారు. అయితే బయట ఎక్కడా కనిపించడం లేదు.
రేవంత్ తో కలిసి నివాళి
అయితే గురువారం ఉదయం మాత్రం ఉన్నట్లుండి ఆయన టీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో ప్రత్యక్షమయ్యారు. గురువారం వైఎస్సార్ జయంతి కదా. తన ఆత్మీయ మిత్రుడికి నివాళి అర్పించేందుకే కేవీపీ గాంధీ భవన్ కు వచ్చారు. పార్టీ నేతలతో కలిసి ఆయన తన మిత్రుడికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టీ పీసీసీ చీఫ్ గా కొత్తగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి, పార్టీ సీనియర్లు మల్లు భట్టి విక్రమార్క, అంజన్ కుమార్ యాదవ్ తదితరులతో కలిసి కేవీపీ తన మిత్రుడికి నివాళి అర్పించారు.
వైఎస్సార్ అడుగుజాడల్లోనే..
జగన్ మాదిరి కేవీపీ కూడా గాంధీ భవన్ కు రాకుండానే వైఎస్సార్ కు నివాళి అర్పించినా ప్రశ్నించే వారే లేరు. అయితే జగన్ కు భిన్నంగా సాగుతున్న కేవీపీ.. ఇప్పటికీ వైఎస్సార్ అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. తన రాజకీయ ప్రస్థానం మొత్తం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగించిన వైఎస్సార్ మాదిరే.. ఆయన ఆత్మీయ మిత్రుడిగా కేవీపీ కూడా కాంగ్రెస్ పార్టీలోనే చివరి దాకా కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే వైఎస్సార్ కు నివాళి అర్పించేందుకు కేవీపీ గాంధీ భవన్ కు వచ్చారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- రెండేళ్లలో కాంగ్రెస్ కు అధికారమే లక్ష్యం: రేవంత్











