తెలుగు దేశం పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎల్.రమణ అధికార టీఆర్ఎస్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఎప్పుడో సిద్ధమైపోయారు. అయితే ఆయన రాకకు గానీ, ఆయనతో భేటీకి గానీ టీఆర్ఎస్ అధిష్ఠానం అంతగా ఆసక్తి చూపడం లేదన్న వాదనలు ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. నెల రోజుల క్రితమే టీఆర్ఎస్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రమణ సిద్ధం అయినట్లుగా వార్తలు వినిపించాయి. అయితే ఇప్పటిదాకా ఆయనకు కేసీఆర్ అపాయింట్ మెంటే ఇవ్వని వైనం.. ఆయనకు టీఆర్ఎస్ లో ఏ మేర ప్రాధాన్యం దక్కనుందన్న విషయంపై అనుమానాలు రేకెత్తిస్తోంది. ఈ విషయాన్ని ఎల్.రమణ అంతగా గుర్తించలేక అడ్డంగా బుక్కైపోతారా? అన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
పిలిచి మరీ అవమానిస్తారా?
తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయినా.. తెలంగాణలో ఇంకా టీడీపీకి గట్టి పట్టే ఉంది. గ్రామ సీమల్లో టీడీపీకి ఇప్పటికీ గట్టి కేడర్ ఉండనే ఉంది. అయితే కేడర్ ను నడిపించే నాయకుడు లేకపోవడంతోనే పార్టీ మిశ్రమ ఫలితాలను చవిచూస్తోంది. ఇలాంటి తరుణంలోనూ 2018 ఎన్నికల్లో రెండు అసెంబ్లీ సీట్లను గెలుచుకుని టీడీపీ తన ఉనికిని చాటుకుంది. అయితే ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను కేసీఆర్ తన పార్టీలోకి లాగేశారు. అసెంబ్లీలో టీడీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో కలిపేసుకున్నారు. అయినా కూడా ఏమాత్రం వెనక్కు తగ్గని ఎల్.రమణ టీడీపీని నిమ్మిన బంటుగానే కొనసాగారు. అయితే ఏం జరిగిందో గానీ.. ఎల్.రమణ కూడా టీఆర్ఎస్ వైపు చూడటం ప్రారంభించారు. ఈ క్రమంలో చాలా కాలం పాటు ఆయనకు అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీఆర్ గురువారం నాడు అపాయింట్ మెంట్ ఇచ్చినట్టుగా సమాచారం.
మెత్తబడితే అంతే గురూ
టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ద్వారా పావులు కదిపిన టీఆర్ఎస్ అధిష్ఠానం ఎల్.రమణను తన వైపునకు లాగే దిశగా సఫలం అయ్యిందనే చెప్పాలి. త్వరలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ సీట్లలో ఓ సీటును రమణకు ఇస్తామని కబురు పెట్టింది. దీంతో రమణ కూడా పదవి తీసుకునేందుకే మొగ్గు చూపుతూ టీఆర్ఎస్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధపడిపోయారు. ఎప్పుడైతే ఎల్.రమణ మెత్తబడ్డారో.. అప్పుడే టీఆర్ఎస్ తన అసలు రూపాన్ని బయటపెట్టుకుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. రమణ అడిగిన వెంటనే అపాయింట్ మెంట్ ఇవ్వకుండా ఉంటే.. ఆయనే వెంటబడతారని, ఆపై పార్టీలో చేర్చుకున్నాక ఎమ్మెల్సీ సీటు ఇవ్వకపోయినా నడిచిపోతుందన్నది టీఆర్ఎస్ భావనగా తెలుస్తోంది. మరి ఈ పరిణామాలను రమణ గమనిస్తూనే ఉన్నారా? లేదంటే.. ఎగేసుకుని వెళ్లి బుక్కైపోతారా? అన్నది తేలాల్సి ఉంది.
Must Read ;- అదిరేటి లాజిక్ తో కేసీఆర్‌పై ఆ ఎంపీ అటాక్











