ఐపీఎల్ 14వ సీజన్‌లో హైదరాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంను ఒక వేదికగా చేర్చాలని తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. ఐపీఎల్ వేదికలపై చర్చ నడుస్తున్న నేపథ్యంలో కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఐపీఎల్ పాలక మండలి, భారత క్రికెట్ బోర్డులకు బహిరంగంగా అప్పీల్ చేశారు. కొవిడ్-19 నియంత్రణలో దేశంలోని అన్ని ప్రధాన నగరాల కన్నా హైదరాబాద్ ముందుందని గుర్తు చేశారు. అందుకు ఇక్కడ నమోదవుతున్న అత్యల్ప కేసుల సంఖ్యే నిదర్శనమని పేర్కొన్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లు ఉప్పల్‌లో నిర్వహించేందుకు అవసరమైన సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు.
ఆరు నగరాల ఎంపిక!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపీఎల్ )-14వ సీజన్‌ను దేశంలోని ఆరు నగరాల్లో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఇందు కోసం ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, ఢిల్లీలను ఎంపిక చేశారు. చివరి నిమిషంలో ఢిల్లీని ఈ జాబితాలో చేర్చినట్టు సమాచారం. ఇక అహ్మదాబాద్ పేరిట ఏ ఫ్రాంచైజీ లేకపోయినా అక్కడి భారీ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయనే కారణంతో ఎంపిక చేశారు. ఏప్రిల్ రెండో వారంలో ఈ లీగ్ ప్రారంభం కానుంది.
ముంబైని తొలగిస్తే.. హైదరాబాద్‌కు ఛాన్స్..
గతేడాది అబుదాబి, షార్జా, దుబాయ్ ఇలా మూడు వేదికల్లోనే మొత్తం మ్యాచ్‌లు నిర్వహించిన బోర్డు.. ఈసారి దాన్ని రెండింతలు చేస్తూ ఆరు నగరాలను ప్రాథమికంగా ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య ఈ నెల 23 నుంచి పుణె వేదికగా జరుగనున్న మూడు వన్డేల సిరీస్ కే ఆ రాష్ట్ర క్రికెట్ బోర్డు ప్రేక్షకులను అనుమతించకూడదని నిర్ణయించింది. ఇలాంటి సమయంలో అక్కడ ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించినా.. వాటిని ఖాళీ మైదానాల్లోనే జరపాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ముంబైని జాబితా నుంచి తొలగిస్తే.. ఆ స్థానంలో హైదరాబాద్‌కు ఛాన్స్ దక్కే వీలుంది.