మన దేశంలో కేసులు తగ్గాయని సంబరపడుతున్నా, దేశ రాజధానిని కరోనా భూతం పట్టి పీడిస్తుంది. దానికి కాలుష్యం తోడవడంతో కరోనా విలయతాండవం చేస్తుందనే చెప్పాలి. కరోనా మూడో వేవ్ మొదలైందంటూ ప్రభుత్వమే ఆందోళన చెందుతుంటే, ఇక ప్రజల సంగతి చెప్పనక్కరలేదు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఆలోచన పాఠశాలల పైనే ఉంది. దానిపై ఒక స్పష్టతను ఇచ్చింది ఢిల్లీ ప్రభుత్వం.
పాఠాల కన్నా ప్రాణాలే ముద్దు
పాఠశాలలు తెరవడం శ్రేయస్కరం కాదని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఎప్పటి వరకూ అనుకుంటున్నారా? టీకా అందుబాటులోకి వచ్చేంతవరకూ అంటున్నారు ఢిల్లీ వైద్య శాఖ మంత్రి మనీష్ సిసోడియా. కరోనా విజృంభిస్తున్న ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేయలేమని మనీష్ ప్రకటనను విడుదల చేశారు. పాఠశాలలు తెరవడం గురించి ఎప్పటికప్పుడు విద్యార్థుల తల్లిదండ్రుల సూచనలు తీసుకుంటున్నామని వెల్లడించారు. పరిస్థితులను తదుపరి ఆదేశాలు జారీ చేస్తామని అప్పటి వరకు పాఠశాలలు తెరవమని స్పష్టంగా తెలియజేశారు.
మార్చి 16న మూతపడ్డ పాఠశాలలు
దేశంలో కరోనా ప్రవేశించడంతోనే మొదట ఎక్కవ ప్రభావానికి గురైన ప్రాంతం ఢిల్లీ అని చెప్పచ్చు. రాజధాని కావడం ఒక కారణం అయితే, కాలుష్యం విపరీతంగా ఉన్న ప్రాంతం కూడా కావడంతో కరోనా మహమ్మారిని అదుపు చేయడం ఎవరితరం కావడం లేదు. ఈ పరిస్థితుల వల్ల ఢిల్లీలో మార్చి 16న స్కూల్స్ మూతపడ్డాయి. అప్పటి నుండి పాఠశాలలు తెరవడం విషయంతో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుంది. అన్ లాక్ 5.0 లో భాగంగా పాఠశాలలు తెరుచేందుకు కేంద్రం అనుమతులు కల్పించినా కోవిడ్ రెండు, మూడు వేవ్ అంటూ విడతల వారిగా బాదుతుంటే, పాఠశాలలు తెరిచే ధైర్యం చేయలేకపోతోంది ప్రభుత్వం.
నిర్ణయం తీసుకోని కొన్ని రాష్ర్టాలు
పాఠశాలల పురరుద్ధరణ గురించి తెలంగాణ, తమిళనాడు లాంటి కొన్నిరాష్ట్రాలు ఇప్పటికీ వెనుకంజ వేస్తున్నాయి. ఆన్ లైన్ క్లాసులకు అనుమతులిచ్చిన ప్రభుత్వం, పాఠశాలలు తెరవడం అంటే కరోనా వేగంగా వ్యాప్తి చెందడానికి ప్రభుత్వం స్వయంగా గేట్లు తెరిచినట్లు అవుతుందని వారి ఉద్ధశం. కానీ ఏపీ మాత్రం మావన్నీ ఏం లేవు అన్నట్లుగా ఉంది. పిల్లల హాజరుకు, తల్లిదండ్రుల నుండి అనుమతి పత్రం కోరిన ప్రభుత్వం, ఆ పత్రంలో, పిల్లలు హాజరు కావడం మాకు ఇష్టం లేదు అని చెప్పే ఆప్షన్ ఇవ్వకపోవడం లోనే తెలుస్తుంది ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి.
మరి ఏపీకి ఏమైంది?
మొదటి నుండి కరోనా కూడా ఒక జ్వరం లాంటిదే అనే ధోరణిలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. పాఠశాలలకు అడ్డంరాని కరోనా, ఎన్నికలంటే మాత్రం బాబోయ్ కరోనా అంటుండడం చూసి, పిల్లల ప్రాణాలు అంత విలువ లేనివా అని ఆశ్చర్యపోవడం ప్రజల వంతైంది. అక్టోబర్ లోనే కర్నూలులో దాదాపు 27 మంది విద్యార్థులకు కరోనా నిర్థారైనా కూడా ప్రభుత్వ లెక్కచేయలేదు. అప్పటికప్పుడు 10 రోజులు మూసివేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆపై నవంబర్ లో పాఠశాలలు తెరిచిన వెంటనే దాదాపు 829 టీచర్లు, 575 మంది విద్యార్థులు కరోనా నిర్థారైనా, ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది.
ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయం వల్ల పిల్లల చదువుకు ఇబ్బందులున్నా, ప్రాణాల కంటే పాఠాలు ముఖ్యం కాదంటున్న ఢిల్లీ నిర్ణయం మెచ్చుకోవాల్సిందే.
Must Read ;- ట్యూషన్ కేంద్రం కాస్త.. కరోనా హాట్‌స్పాటైంది!











