జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ గెలవదని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఓటమిని ముందే ఒప్పేసుకున్నారు. ఈ రోజు ఆయన ప్రజాగాయకుడు, ప్రజా యుద్దనౌక గద్దర్‌తో రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో గద్దర్‌ను రేవంత్‌రెడ్డి కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గద్దర్‌తో ఆయన రాజకీయపరమైన అంశాల గురించి చర్చించినట్లు తెలిసింది. అయితే ఈ సందర్భంగా గ్రేటర్ ఎన్నికలపై రేవంత్‌రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు. ఒకవేళ తమ పార్టీ గెలవకున్నా గానీ కనీసం 25 నుంచి 30 సీట్లను తప్పకుండా కైవసం చేసుకుంటుందని పేర్కొన్నారు. ప్రజల అండ తమ పార్టీకి ఉందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం రాష్ట్రంలో బలంగా ఉంటేనే సమస్యలపై పోరాడి పరిష్కారం చేసుకోవచ్చని రేవంత్ తెలిపారు. నగరంలో 30 మంది కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను గెలిపిస్తే నగర సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని రేవంత్ చెప్పడం గమనార్హం.
ఓటమిని ఒప్పేసుకున్నారా?
ఇంకా పోలింగ్‌కు ఆరు రోజుల సమయం ఉండగానే రేవంత్ రెడ్డి నోటి వెంట ఇలాంటి మాటలు ఎందుకు వచ్చాయనే చర్చ ప్రస్తుతం రాజకీయవర్గాల్లోనూ, తమ పార్టీ కార్యకర్తల్లోనూ జరుగుతోంది. అంటే ఎన్నికల్లో తమ పార్టీకి ఓటమి తప్పదనే అంచనాకు ముందే రేవంత్ వచ్చేశారా? అనే చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ విజయం ఇక ఖాయమని ముందే పసిగట్టి ఇలా మాట్లాడి ఉంటారని అంతా అనుకుంటున్నారు. ఓడిపోతున్నా కూడా ఏ పార్టీ నాయకుడు సైతం తమ పార్టీ ఓడిపోతుంది.. కొన్నే సీట్లు వస్తాయనే కామెంట్లు పోలింగ్‌కు ముందు చెప్పరు. కచ్చితంగా గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేసి కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తారు. అలాంటిది రేవంత్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆ పార్ట కార్యకర్తల్లో నిరుత్సాహాన్ని నింపుతున్నాయట. మరి రేవంత్ కామెంట్స్ వెనుకాల ఉన్న అర్ధం, పరమార్ధం ఏమిటో తనకే తెలియాలి. అయితే రేవంత్ రెడ్డిపై కవిత రాసి గద్దర్ వినిపించారు.
Must Read ;- ఆంధ్రోళ్ల ఓట్ల కోసం పోసానితో ఇలా మాట్లాడిస్తున్నారా?