(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
ఉత్తరాంధ్రలో అక్రమార్కులకు మాంగనీస్ కాసుల పంట కురిపిస్తోంది. భూగర్భ గనుల శాఖ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తుండటంతో అక్రమార్కులు యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రభుత్వం ఉదాసీనత కూడా వీరికి కలిసొస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అపారంగా నిక్షేపాలు
ఉక్కు తయారీకి ప్రధాన ముడి సరుకుగా వినియోగించే మాంగనీస్ ఖనిజ నిక్షేపాలు ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో అపారంగా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని మైనింగ్ సంస్థల లీజులు పొంది తవ్వకాలు సాగిస్తుండగా గనుల శాఖకు రాయల్టీ రూపంలో భారీగా ఆదాయం సమకూరుతోంది. అదే సమయంలో అక్రమార్కులు గనుల శాఖకు చెందిన కొంతమంది అధికారుల అండదండలతో దొడ్డిదారిన మాంగనీస్ నిక్షేపాలు తరలిస్తుండటంతో ప్రభుత్వం కోట్లాది రూపాయల రాయల్టీ కోల్పోతుంది. ఈ ఏడాది విజయనగరం జిల్లా నుంచి రూ.60 కోట్లు, శ్రీకాకుళం జిల్లా నుంచి రూ.100 కోట్ల ఆదాయం లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది.ఇందులో అధికశాతం మాంగనీస్ గనుల నుంచే వస్తోంది. దీన్ని మరింత పెంచుకునేందుకు దృష్టి పెట్టిన గనుల శాఖ ఖనిజ లభ్యత ఆధారంగా కొత్త బ్లాకుల గుర్తింపునకు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఉన్న గనులకు సమీప భూముల్లో మరిన్ని నిల్వలు ఉంటాయనే ఉద్దేశంతో జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) ఖనిజాన్వేషణ సాగిస్తోంది. ఈ సర్వే పూర్తయ్యాక లీజులు ఇచ్చేందుకు ఇ-వేలం నిర్వహించనుంది.
విజయనగరం జిల్లాలో ..
విజయనగరం జిల్లాలో గరివిడి మండలంలో దేవాడ-దువ్వాం, మందిరవలస, చీపురుపల్లి మండలం నిమ్మలవలస, గుర్ల మండలం సదానందాపురం, మెరకముడిదాం మండలం చినబంటుపల్లిలో కొత్త గనులు జీఎస్‌ఐ గుర్తించింది. ఇప్పటికే దేవాడ-దువ్వాం మైనింగ్ బ్లాక్‌లో జీఎస్‌ఐ అధ్యయనం పూర్తి చేసింది. ఇక్కడ 12 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఖనిజం ఉన్నట్లు గుర్తించింది. కొత్తగా లీజులు ఇచ్చేందుకు ఇ-వేలం ప్రక్రియను నిర్వహించేందుకు ఆ శాఖ సన్నద్ధమవుతోంది.
నిమ్మలవలస, మందిరవలస, సదానందపురం, చినబంటుపల్లి, బాతువ, పెదలింగాలవలస బ్లాకుల్లో ఖనిజ నిల్వలను గుర్తించే బాధ్యతను మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ట్రస్ట్(మెరిట్)కు గనులశాఖ అప్పగించింది. ఒక్కో బ్లాక్ పరిధిలో 300-400 హెక్టార్ల వరకు భూముల్లో పరిశోధనలు చేస్తున్నారు. మైనింగ్ బ్లాకుల్లో డీజీపీఎస్, టోపో సర్వేలు పూర్తి చేసి కొన్నింట్లో కోర్ డ్రిల్లింగ్ జరిపామని, అధ్యయన ప్రక్రియ పూర్తయ్యే సరికి రెండు మూడు నెలలు పడుతుందని సర్వే బృందం తెలిపింది.
శ్రీకాకుళం జిల్లాలో..
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం పెదలింగాలవలస, జి.సిగడాం మండలం బాతువలో సవరించిన గనుల చట్టం-2015 ప్రకారం కొత్త గనులు, లీజుల అనుమతులన్నీ ఆన్‌లైన్ విధానంలో ఇ-వేలం ద్వారా నిర్వహించేందుకు గనుల శాఖ సిద్ధమైంది. మాంగనీసు ఖనిజ లభ్యత ఉన్న ప్రాంతాలను మైనింగ్ బ్లాక్‌లుగా గుర్తించారు. వీటిలో నిల్వలపై పరిశోధన ఇంకా జరుగుతోంది. దేవాడ-దువ్వాం బ్లాక్‌లో సర్వే ప్రక్రియంతా పూర్తికావడంతో ఇక్కడ గనుల లీజుకు త్వరలో ఇ-వేలం నిర్వహిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు.
ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి ఉన్నతాధికారులను అప్రమత్తం చేస్తే మాంగనీస్ నిక్షేపాలు ద్వారా కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుందని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు
Must Read ;- మన ఆస్తులపై వారు కన్నేశారు!











