(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని దేశవ్యాప్తంగా రైతాంగం దేశ రాజధానిలో తిష్టవేసి కూర్చుంది. మంగళవారంనాడు భారత్ బంద్‌కు దేశం సన్నద్ధం అవుతోంది. అందులో భాగంగా ఇప్పటికే కేంద్రంలోని ఎన్డీయే వ్యతిరేక పార్టీలన్నీ దాదాపుగా ఏకం అయ్యాయి. పొరుగునే ఉన్న మన తెలుగు రాష్ట్రం తెలంగాణలో సర్కారు రైతులకు మద్దతుగా తన గళం గట్టిగానే విప్పింది. టోల్‌ప్లాజాలను ఆక్రమించి రాకపోకలు నిలిపివేస్తామని, ఢిల్లీకి వెళ్లే అన్ని మార్గాలను అడ్డుకుంటామని, జాతీయ రహదారులు దిగ్బంధనం చేస్తామని రైతు సంఘాలు పలు ప్రభుత్వాలు ఇప్పటికే ప్రకటించాయి. ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో ఆందోళన రోజురోజుకూ తీవ్రమవుతోంది.
తెలంగాణ రాజస్థాన్, రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నాయకులు చర్చల్లో కేంద్రానికి వ్యతిరేకంగా వాదనలు వినిపించారు. హరియాణా సరిహద్దుల్లోను ఢిల్లీకి వెళ్లే మార్గాలను మూసివేశారు. రైతులకు మద్దతుగా దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఇవి.
కిమ్మనని జగన్ సర్కార్..
రైతుల పక్షపాతి అని.. రైతుల కోసమే ఈ ప్రభుత్వం అని సీఎం మొదలు మంత్రుల వరకు.. రైతు జపం చేయని రోజు లేదు. మరి దేశవ్యాప్తంగా రైతులకు అన్యాయం జరుగుతున్నదంటూ, కేంద్రం నల్లచట్టాలు తెచ్చినదంటూ ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుండగా రాష్ట్రంలో మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని, వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు గాని పెదవి విప్పడం లేదు. రైతులకు మద్దతు ప్రకటించడం లేదు. కేంద్రాన్ని పల్లెత్తు మాట అనడం లేదు. రాష్ట్రంలో రైతుల దౌర్భాగ్యమో? అనే సందేహాలు ప్రజల్లో తలెత్తుతున్నాయి. రైతు వ్యతిరేకమైనవిగా ముద్రపడిన కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులకు పార్లమెంటులో ఆంధ్ర రాష్ట్ర ఎంపీలంతా మద్దతు పలికారు. ఈ లెక్కన రాష్ట్రంలో వైయస్సార్సీపి ప్రభుత్వం రైతుల పక్షపాతా? వ్యతిరేకా? అన్న సందేహం అందరిలోనూ మొదలైంది.
Also Read ;- ఉక్కుపాదం : పంజాబ్ రైతుపై తుపాకి ఎక్కుపెట్టిన కేంద్రం
ముందు గొయ్యి .. వెనక నుయ్యి..
ప్రస్తుతం అధికార పార్టీ పరిస్థితి ఇలానే ఉంది. బోలెడన్ని చార్జిషీట్లతో కోర్టుల చుట్టూ ప్రదక్షిణాలు చేసే జగన్ మోహన్ రెడ్డి అటు ముందుకు వెళ్ళలేక.. వెనక్కు రాలేక.. రైతుల ఊసే ఎత్తడం మానేశారు. రైతులకు మద్దతు పలికితే, చట్టాల్లో లోపాల గురించి మాట్లాడితే కేంద్రం కన్నెర్ర చేస్తుందని భయం.. అదే సమయంలో, సైలెంట్ గా ఉంటే.. ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తాయన్న భయం వెన్నాడుతున్నాయి. కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులతో రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయని, బంద్‌లో ప్రతిఒక్కరూ పాల్గొనాలని, రహదారులను దిగ్బంధించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కేటీఆర్ కేడర్‌కు పిలుపునిచ్చారు. రేపు పొద్దున రైతులు ముందుకు వెళ్లి “ మీ తరఫున మేం పోరాటం చేసాం…” అని చెప్పుకునే హక్కును సాధించారు. 11 రోజులుగా.. ఎముకలు కొరికే చలిలో దేశ రాజధానిలో రైతులు నడిరోడ్డుపై ఆందోళనలు చేస్తుంటే.. దానిపై కనీసం స్పందించని రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఏమనాలి?
అనేక విషయాల్లో పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రానికి వ్యతిరేకంగా చెలరేగిపోతూ, దుమ్మెత్తిపోసిన సంఘటనలు ఉన్నాయి. అన్నదాత ఏడుస్తుంటే… మానవత్వంతో పరిసరప్రాంతాల జనమంతా రైతులకు బాసటగా నిలుస్తున్నారు. మరి ఏపీలో రైతులు చేసుకున్న పాపం ఏంటి? అనేది బోధపడడం లేదు.
సోషల్ మీడియాలోనూ రైతులకు మద్దతుగా బంద్ విజయవంతం చేయాలని అనేక వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. తెల్లారింది మొదలు… టీడీపీపై ఆడిపోసుకోవడం మానేసి… ఇప్పటికైనా బంద్‌కు మద్దతుగా జగన్ ప్రభుత్వం కదిలితే.. కేంద్రం మీద ఒత్తిడి పెరిగి రైతు సమాజానికి మేలు జరుగుతుంది.
ఇతరుల సంగతేంటి..
ఏపీలో తాము వచ్చే ఎన్నికల్లోగా బలపడిపోయి అధికారంలోకి వచ్చేస్తం అని డబ్బా కొట్టుకుంటూ ఉండే భారతీయ జనతా పార్టీ.. యథావిధిగా కేంద్రంలోని తమ ప్రభుత్వం తెచ్చిన నల్లచట్టాలను సమర్థించుకుంటూ కాలం గడుపుతోంది. చంద్రబాబునాయుడు మాత్రం వీటిని నిరసించారు. రైతులతో మాట్లాడి.. అన్ని వర్గాలకు అనుకూలంగా ఉండే నిర్ణయాలు మాత్రమే చేయాలని కేంద్రానికి హితవు చెప్పారు. పవన్ కల్యాణ్ సరే సరి.. బీజేపీ ప్రాపకం కోసం వెంపర్లాడిపోతున్న పవన్ కల్యాణ్.. రైతుల గురించి తాను ఎంతో కష్టపడుతున్నట్టుగా కనిపిస్తారు గానీ.. ఈ చట్టాల విషయంలో నోరు మెదపడం లేదు.
Must Read ;- నిరసన సెగ : రైతుల ప్రధాన డిమాండ్లు ఆ మూడే