రవితేజ విషయంలోను సెంటిమెంట్ కలిసొచ్చింది. ఆయన సినిమా టైటిల్ K అక్షరంతో మొదలైతే చాలు హిట్ కొట్టేస్తోంది. అలా గతంలో వచ్చిన ‘కృష్ణ’ .. ‘కిక్’ సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. రీసెంట్ గా వచ్చిన ‘క్రాక్’ కూడా మామూలుగా ఆడటం లేదు. చాలాకాలం తరువాత కాసుల వర్షం అంటే ఇలా ఉంటుందనీ, హిట్ టాక్ ఇంత స్పీడ్ గా వస్తుందని నిరూపించిన సినిమా ఇది. ఈ సినిమా టిక్కెట్ల కోసం అంతా నానా హడావిడి పడిపోతూ ఉంటే, రవితేజ మాత్రం కూల్ గా తన తదుపరి ప్రాజెక్టును పట్టాలెక్కించాడు.
సెంటిమెంటును ఫాలో అవుతూ ఈ సినిమాకి ‘ఖిలాడి‘ టైటిల్ ను సెట్ చేశారు. రమేశ్ వర్మ ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డేట్ ను ఇలా చెప్పేసి అలా షూటింగు మొదలుపెట్టేశారు. అంతే స్పీడ్ గా రిలీజ్ డేట్ ను కూడా ఎనౌన్స్ చేయడం విశేషం. మే 28వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, రిలీజ్ డేట్ తో కూడిన ఒక పోస్టర్ ను వదిలారు. రవితేజ ఈ పోస్టర్ లో చాలా స్టైలీష్ గా కనిపిస్తూ, అభిమానులను ఆకట్టుకుంటున్నాడు.
రవితేజ లుక్ .. ఆయన ‘గన్’ పట్టుకున్న తీరు చూస్తుంటేనే ఇది యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో డింపుల్ హయతి – మీనాక్షి చౌదరి ఆయన సరసన అందాల విందు చేయనున్నారు. ఇక ఈ సినిమాలో ప్రతినాయకుడిగా యాక్షన్ కింగ్ అర్జున్ కనిపించనున్నాడు. ప్రస్తుతం ఆయన కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ బాణీలను సమకూర్చుతున్నాడు. ఈ సినిమాతో రవితేజ ఈ ఏడాది మరో హిట్ ను సొంతం చేసుకుంటాడేమో చూడాలి.
Must Read ;- విజయ్, నాని తర్వాత ఇతని కన్ను రవితేజ పై పడిందా?