రవితేజ వరుసగా ఇస్తూ వచ్చిన ఫ్లాఫు సినిమాలకి ‘క్రాక్‘ విరుగుడు మందుగా పనిచేసింది. ఈ ఏడాది ఇండస్ట్రీ నుంచి తొలి హిట్ ఇచ్చిన హీరోగా రవితేజ రికార్డులకు ఎక్కాడు. మాస్ యాక్షన్ కామెడీతో తన బిరుదును ఆయన మరోసారి సార్థకం చేసుకున్నాడు. లాక్ డౌన్ తరువాత జనం థియేటర్లకు రావాలంటే, ఒక పెద్ద సినిమా పడాలనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేశారు. కానీ పెద్ద హిట్ తో ఆ పనిని రవితేజ సినిమానే చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఏ రకంగా చూసినా రవితేజ కెరియర్లో ఇది ఓ ప్రత్యేకమైన సినిమాగానే చెప్పుకోవాలి.
ఈ సినిమా విడుదలకి ముందే రవితేజ .. ‘ఖిలాడి’ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. రమేశ్ వర్మ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. గతంలో రవితేజ – రమేశ్ వర్మ కాంబినేషన్లో ‘వీర’ అనే సినిమా వచ్చిందిగానీ అది పెద్దగా ఆడలేదు. రమేశ్ వర్మ దర్శకత్వంలో కాస్త గుర్తుపెట్టుకోదగిన సినిమా ఏదైనా ఉందంటే, అది బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన ‘రాక్షసుడు’ మాత్రమే .. అది కూడా రీమేక్. అయినప్పటికీ ఆ సినిమాను ఆయన డీల్ చేసిన తీరు నచ్చడంతో రవితేజ ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమాలో రవితేజను రమేశ్ వర్మ చాలా స్టైలీష్ గా చూపించనున్నాడు. కోనేరు సత్యనారాయణ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
ఇక ఈ సినిమాలో రవితేజ సరిసన నాయికలుగా మీనాక్షి చౌదరి – డింపుల్ హయతి కనిపించనున్నారు. గతంలో ఒకరు మోడలింగులోను .. మరొకరు ఐటమ్ సాంగులోను మెరిశారు. ఈ ఇద్దరి విషయంలోనే రవితేజ అభిమానులు ఇప్పుడు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గ్లామరస్ గా తెరపై కాసేపు కనిపించడం వరకూ ఓకే. కానీ ‘క్రాక్’ వంటి సూపర్ హిట్ తరువాత రవితేజ స్టార్ హీరోయిన్స్ రేసులోలేని కొత్త అమ్మాయిలతో చేయడం కరెక్ట్ కాదేమోనని అంటున్నారు. అలా చేస్తే అది సాహసమే అవుతుందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కథలో భాగంగా ఈ ‘ఖిలాడి’ .. గ్లామరస్ భామల చుట్టూనే తిరుగుతాడేమో. అందుకే ఈ భామలను బరిలోకి దింపి ఉండొచ్చుననే టాక్ కూడా వినిపిస్తోంది.
Must Read ;- రవితేజ లేకపోతే నేను లేను :క్రాక్ డైరెక్టర్











