‘భజే వాయు పుత్రం.. భజే వాల గాత్రం..’- ఏమిటీ ఆంజనేయ దండకం అనుకుంటున్నారా? ఆకాశం ఉరిమింది.. ఓ మెగా మెరుపు మెరిసింది.. అందుకే ఈ దండకం. ఏదైతేనేం.. మొత్తానికి ‘వాయు’ పుత్రుడు గాలి ఊదారు.. ఆ గాలి మామూలు గాలా..పైగా మెగా గాలి.. తుపానులా జనంలోకి వెళ్లిపోయింది.
చిరులో ఏమిటీ ‘మెగా’ మార్పు? సినిమాల్లో నాతో తన్నులు తినే సోనూ ఆ స్థాయిలో చేయగా లేనిది.. నేను ఈ స్థాయిలో చేయలేనా అనుకున్నారో.. చేయకపోతే ఉన్న పరువు పోతుందని అనుకున్నారో తెలియదుగానీ.. ‘గాలి’వాటంగా ముందుకు వెళ్లడమే బెటరని అనుకున్నట్టుంది. పైగా వానర సేనలా మెగా సైన్యం, జనసేన వెనక ఉండనే ఉన్నాయి. కాకపోతే రాజమౌళి సినిమాలా ఈ ‘మాస్టర్’ ప్లాన్ కొద్దిగా ఆలస్యమైందంతే.
అందరి చూపూ మెగాస్టార్ వైపే..
ఈ కరోనా సంక్షోభంలో తెలుగు సినిమా రంగంలో అందరి చూపులూ చిరంజీవి వైపే ఉన్నాయి. ఈ విషయంలో బహుశా మెగాస్టార్ కు నిద్ర పట్టి ఉండదు. ఏం చేయాలి? ఎలా చేయాలి? కానీ ఏదో చేయాలి.. ఇలా సాగి ఉంటాయి ఆయన ఆలోచనలు. కాకపోతే వచ్చిన చిక్కల్లా ఏమిటంటే అందరికన్నా.. అంటే సోనూ కన్నా ముందే ఈ ఆలోచన మెగాస్టార్ కు వచ్చి ఉంటే ఎంతో బాగుండేది. ఎందుకంటే ఎక్కడో ఉత్తర భారతంలో పుట్టి తెలుగులో ఎక్కువ సినిమాలు చేసిన విలన్ ఉన్న పళాన హీరో అయిపోయాడు. జనం హీరోలను విలన్లు లాగా చూస్తున్నారు.
అల వైకుంఠపురంలో ఉన్న మెగాస్టార్ వద్దకు సినీ ముని జనమంతా గాలి పోగేసుకొచ్చి చెప్పేవారేగాని ఇలాంటి ‘గాలి’ని అందించవచ్చని మాత్రం చెప్పలేదు. ఆలోచిస్తూ కూర్చుంటే మలయమారుతం శరీరాన్ని తాకింది. మదిలో ఓ మెరుపు మెరిసింది. బంగారంలోని ప్రామాణికతను నిర్ణయించడానికి ఆర్కిమెడీస్ కు ఓ ఆలోచన రాగానే ‘యురేకా’ అంటూ పరుగులు పెట్టాడంటారు. ఈయన యురేకా అనలేదుగానీ ‘సురేఖా’ అని మాత్రం అని ఉంటారు. కరోనాతో అల్లాడుతున్న జనానికి మనం ఆక్సిజన్ అందిద్దాం అనేసి ఉంటారు.
ఎందుకంటే ఆయన చిరంజీవి, ఆయన తమ్ముడు పవన్.. ఈ రెండూ గాలి పేర్లే. ఐ మీన్.. ప్రాణవాయువు అనుకోండి. ఇప్పటికైనా మించి పోయిందేమీ లేదు. ఎలాగూ బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్స్ ఉన్నాయి కదా.. ఆక్సిజన్ బ్యాంక్స్ పెట్టేద్దామని నిర్ణయించేశారు. ఏ నెట్ వర్కూ లేని సోనూ ఒక్కడుగా మొదలెట్టి చేయగా లేనిది ఇంతటి అభిమాన దళం ఉండి మనం ఎందుకు చేయలేకపోయాం అన్న అంతర్మథనం లోంచి ఈ ఆలోచన పుట్టుకొచ్చినట్టుంది. మొత్తానికి కార్యరూపం దాల్చబోతోంది.
పాజిటివ్ రోజుల్లో నెగిటివ్ ఏలనో..
కరోనా పాజిటివ్ లో నెగిటివ్ ప్రచారాలను పట్టించుకోకూడదు. ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఎంతెంత సాయం అందించారో లెక్కతీసి చూస్తేనేగాని అర్థం కాదు. ఎంత చేసినా ఏంచేశారులే అంటూ పెదవి విరుపులు. సినిమా రంగంలో ఇవన్నీ షరామామూలే. గోరంత చేసి కొండంత ప్రచారం చేసుకుంటున్నారంటూ రాళ్లు వేసే బ్యాచ్ లు కూడా ఉంటాయి. పావలా – శ్యామలకు, అర్థ రూపాయి – అభిమానులకూ, ముప్పావలా – సర్కారువారికీ చెల్లించేసుకుంటే ఉన్నదంతా ఊడ్చుకుపోతుందన్న భయం ఉన్నా కొన్ని సందర్భాల్లో రాజీ పడక తప్పదు.
పదో వంతు దానం చేయమని శాస్త్రం కూడా చెబుతోంది కదా. అసలు కరోనా కాలంలో మెగా సైన్యం ఇప్పటిదాకా ఇచ్చిన విరాళం ఆరు కోట్ల రూపాయలు. ఇది ఇక్కడితో ఆగదు ఇంకెక్కడిదాకా పోతుందో తెలియదు. అంతా బాగానే ఉందిగానీ చేసే పని ఏదైనా సుడిగాలిలా చేస్తే బాగుంటుందని సోనూ నేర్పారు. అంతకుమించిన వేగాన్ని ప్రదర్శిస్తే మాత్రం.. ఇది మెగా తుపానే. అన్నీ అనుకూలిస్తే.. ఆ వాయుదేవుడు కరుణిస్తే.. కరోనా కనిపించకుండా పోతే.. మళ్లీ ఈ అన్నదమ్ముల రాజకీయ అనుబంధానికి ఈ ఆక్సిజన్ ఊపిరి పోయవచ్చేమో.
మెగాస్టార్ చేస్తున్న, చేయబోతున్న ఈ సేవలు చూసి ‘మానవత్వం పరిమళించిన మంచి మనిషికి స్వాగతం’ అని జనం స్వాగత గీతం పాడతారో లేదో నిర్ణయించాల్సింది కాలం కాదు కారోనానే. భజే వాయుపుత్రం.. భజే వాల గాత్రం అంటూ అభిమానులు ఇప్పుడు మెగా దండకం మాత్రం చదివేస్తున్నారు. ‘ఆచార్య’ దేవుడి ఆక్సిజన్ కోసం ఆశగా ఎదురుతెన్నులు చూస్తున్నారు.
– హేమసుందర్ పామర్తి
Must Read ;- వారం రోజుల్లో ‘మెగా’ ఆక్సిజన్ బ్యాంక్