MLA Ramulu Naik Compares TRS Activists To The Taliban :
తెలంగాణలో అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిని ఆ పార్టీకి చెందిన కీలక నేతలే ఎప్పటికప్పుడు ఇబ్బందుల్లోకి నెడుతున్న వైనం ఆసక్తి రేకెత్తించేదే. పార్టీ సీనియర్లు కాస్తంత సంయమనం పాటిస్తున్నా.. పార్టీకి చెందిన యువ నేతలు, కొత్తగా ఆ పార్టీలోకి వచ్చి చేరిన నేతలు మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వీరి నోట నుంచి వచ్చే వ్యాఖ్యలతో టీఆర్ఎస్‌పై విపక్షాలు దండెత్తుతున్నాయి. ఆ దండయాత్రల నుంచి పార్టీని కాపాడుకోలేక పార్టీ అధిష్ఠానం నానా తంటాలు పడుతోంది. ఇప్పుడు కూడా అలాంటి ఓ ఘటనే చోటుచేసుకుంది. టీఆర్ఎస్ కార్యకర్తలను తాలిబాన్లుగానే కాకుండా నక్సల్స్ గానూ అభివర్ణిస్తూ ఆ పార్టీ నేత, ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని ఇరకాటంలో పెట్టేశారు.
నాయక్ ఏమన్నారంటే..?
వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న రాములు నాయక్.. నోరు తెరిచారంటే చాలు పార్టీని ఇరకాటంలోకి నెట్టేస్తున్నారు. బహిరంగ సభల్లో ఉన్నామన్న ధ్యాస గానీ, జనంతో మాట్లాడుతున్నామన్న ఇంగితం గానీ లేకుండానే రాములు నాయక్ తన నోటికి ఏది వస్తే అదే మాట్లాడేస్తున్నారు. ఈ క్రమంలో వైరాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మైకందుకున్న రాములు నాయక్.. ‘‘ పార్టీ కోసం మీరు తాలిబాన్లు, నక్సల్స్ మాదిరిగా కర్రలు, పార్టీ జెండాలు పట్టుకుని బరిలోకి దిగితే ఈలలు వినిపిస్తాయి. ప్రతీకారం తీర్చుకునేందుకు మనం రోడ్డెక్కాలి. యుద్ధం చేయడానికి టీఆర్ఎస్ సర్వం సిద్ధంగా ఉంది’’అంటూ రాములు నాయక్ ఓ రేంజిలో తన కేడర్ తో ఉత్సాహం నింపేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగితే బాగుండేదేమో.. తన నోట నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యలపై ఆయన వివరణ కూడా ఇచ్చుకుని మరింత వివాదంలోకి కూరుకుపోయారు. తన ఉద్దేశ్యం ఉగ్రవాదులు కాదని, సుశిక్షితులైన సైనికులు అన్న భావన వచ్చేలానే ఈ వ్యాఖ్యలు చేశానని చెప్పి ఆయన మరింత చిక్కుల్లో పడిపోయారు.
వారు సుశిక్షితులైన సైనికులా?
ఆఫ్ఘనిస్థాన్‌ను చెరబట్టేసిన తాలిబాన్లపై యావత్తు ప్రపంచం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో తాలిబాన్ల హింసపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ప్రజాస్వామ్య పాలనలో అవినీతి పెచ్చుమీరిపోతోందని, దానికి విరుగుడుగా తాము సమాంతర పాలన సాగిస్తామంటూ వాదిస్తున్న మావోయిస్టులు పోలీసు అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులను సైతం చంపేస్తున్న వైనంపైనా విమర్శలు రేకెత్తుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి తమ పార్టీ కార్యకర్తలు తాలిబాన్ల మాదిరిగా, నక్సల్స్ మాదిరిగా పోరు సాగించాలంటూ, అలాంటప్పుడే విజిల్స్ వినిపిస్తాయని రాములు నాయక్ వ్యాఖ్యానించడం నిజంగానే కలకలం రేపుతోంది. ఓ వైపు దేశంలో నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిని నివారించే చర్యలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నిర్వహించిన సమావేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరైన సమయంలోనే రాములు నాయక్ నోట ఈ వ్యాఖ్యలు వినిపించడం గమనార్హం.
Must Read ;- డబుల్ షాక్ దిశగా కేసీఆర్ .. వ్యూహమేంటో?










