ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, ఏపీలోని కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ఖరారు చేసింది. అక్టోబర్ 1న ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కానుండగా.. అదే నెల 8 దాకా నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన జరగనుండగా.. 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. ఇక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ను అక్టోబర్ 30న నిర్వహించనుండగా.. నవంబర్ 2న ఓట్ల లెక్కింపును చేపడతారు. వెరసి అక్టోబర్ 1న మొదలు కానున్న ఎన్నికల ప్రక్రియ నవంబర్ 2న ముగుస్తుందన్న మాట.
హుజూరాబాద్‌లో హోరాహోరీ
తెలంగాణలోని హుజూరాబాద్, ఏపీలోని బద్వేల్ అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఉప ఎన్నిక జరగనున్నా.. అందరి దృష్టి హుజూరాబాద్ బరిపైనే నిలవనుంది. ఎందుకంటే.. ఈ ఉప ఎన్నిక టీఆర్ఎస్‌తో పాటు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసిన ఈటల రాజేందర్‌ల మధ్య జరగనుంది కాబట్టి. ఆది నుంచి టీఆర్ఎస్‌లోనే కొనసాగిన ఈటల.. ఇటీవలే సీఎం కేసీఆర్‌తో విబేధాల కారణంగా పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఈటలను కేసీఆర్ తన కేబినెట్ నుంచి బహిష్కరించేశారు. దీనిని జీర్ణించుకోలేని ఈటల టీర్ఎస్ సభ్యత్వంతో పాటు ఆ పార్టీ నుంచి దక్కిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత వ్యూహాత్మకంగా అడుగులు వేసిన ఆయన బీజేపీలో చేరిపోయారు. ఇప్పుడు అక్కడ బీజేపీ గెలిస్తే తన పరువు పోతుందని టీఆర్ఎస్.. టీఆర్ఎస్ గెలిస్తే తన పరువు పోతుందని ఈటల భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే 3 నెలలుగా ఈటల హుజూరాబాద్‌లోనే మకాం వేశారు. తనదైన శైలి వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఆయనకు తోడుగా బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ఏకంగా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఇక టీఆర్ఎస్ అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా దళిత బంధులాంటి ప్రతిష్ఠాత్మక పథకాలు మొదలుపెట్టింది. హుజూరాబాద్‌కు వేలాది కోట్ల నిధులను విడుదల చేస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ తన అభ్యర్థిగా పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ను ప్రకటించేసింది. బీజేపీ ఇంకా ఈటల పేరును ప్రకటించలేదు. త్వరలోనే ఆయననో, ఆయన సతీమణినో అభ్యర్థిగా ప్రకటించనుంది. మరోవైపు పునర్వైభవం దిశగా సాగుతున్న కాంగ్రెస్ పార్టీ కూడా త్వరలోనే అభ్యర్థిని ప్రకటించనుంది. మొత్తంగా ఇక్కడ త్రిముఖ పోరు సాగనుంది.
బద్వేల్ సీటు వైసీపీదేనా?
ఇక కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గానికి సంబంధించి అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ నేత వెంకటసుబ్బయ్య మృతితో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. బద్వేల్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే.. వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నవెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్ సుధ ఈజీగానే గెలుస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే వైసీపీ దుర్మార్గ పాలనకు చెక్ పెట్టేలా సీఎం జగన్ సొంత జిల్లాకు చెందిన బద్వేల్ లో ఎలాగైనా గెలిచి తీరాలన్న దిశగా టీడీపీ కూడా ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా వైసీపీ కంటే ముందుగానే తన అభ్యర్థిగా ఓబుళాపురం రాజశేఖర్ ను ఖరారు చేసింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ వెంకటసుబ్బయ్యపై రాజశేఖరే టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. స్థానికంగా బలమైన నేతగానే పేరుంది. అంతేకాకుండా 2019లో ఓటమి నేపథ్యంలో ఆయనకు సానుభూతి లభిస్తుందని కూడా టీడీపీ అంచనా వేస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే ఏమాత్రం హడావిడి లేకుండా నియోజకవర్గవ్యాప్తంగా తనదైన శైలి ప్రచారం మొదలెట్టేసిందనే చెప్పాలి. అయితే ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అనుసరించిన వైఖరిని చూస్తుంటే.. టీడీపీ ఎన్ని వ్యూహాలు రచించినా.. సుధ గెలుపును అడ్డుకోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై స్పష్టమైన అవగాహన ఉన్న టీడీపీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం ద్వారా వైసీపీ దూకుడుకు కళ్లెం వేసే దిశగానూ ఓ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించనుందన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
Must Read ;- సీఎం చెప్పినా రాబందు తగ్గలేదు.. చావుబతుకుల మధ్య బాషా