తెలంగాణ ప్రజల ఏళ్ల నాటి కలను సాకారం చేసిందెవరు? ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిందెవరు? అసలు ఈ క్రెడిట్ దక్కేదెవరికి? దక్కాల్సిందెవరికి? ఈ విషయం అంత ఈజీగానే తేలేది కాదు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమం ఫలితంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైందని గులాబీ పార్టీ నేతలు చెబుతుంటే.. కాదు కాదు సోనియా గాంధీ కనికరం వల్లే తెలంగాణ కల సాకారమైందని కాంగ్రెస్ పార్టీ నేతలు వాదిస్తున్నారు. అయితే బీజేపీ మద్దతు లేకుండా ప్రత్యేక తెలంగాణ అసలు సాధ్యమయ్యేదే కాదని కమలనాథులు చెబుతున్న మాటలూ విన్నాం. సరే.. ఈ విషయంలో ఎవరి వాదనలు వారికే వదిలేస్తే.. ఇప్పుటు టీఆర్ఎస్ లో ఉంటూ.. ఆ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ఓ నేత.. ఈ క్రెడిట్ మొత్తం సోనియా గాంధీదేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు టీఆర్ఎస్ లో ఓ తుఫానునే సృష్టిస్తాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు తెలియకుండా పార్టీలో చాలా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
వైరా ఎమ్మెల్యే నోట..
కమ్యూనిస్టుల కంచుకోటగానే కాకుండా తెలుగు దేశం పార్టీకి కూడా పెట్టని కోటగా కొనసాగిన ఖమ్మం జిల్లాలో ఇప్పుడు మెజారిటీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కు చెందిన వారే. టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు టీఆర్ఎస్ లో చేరిపోయారు కదా. మొత్తంగా ఈ జిల్లా ఇప్పుడు టీఆర్ఎస్ వశం అయిపోయింది. ఇలాంటి నేపథ్యంలో ఈ జిల్లాలోని వైరా నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రాములు నాయక్.. ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..‘‘తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి థ్యాంక్స్ చెప్పాలి. తెలంగాణ ప్రజల బాధలు చూశాకే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది’’ అని రాములు నాయక్ ఏమాత్రం తడబాటు లేకుండా చెప్పేశారు.
బైపోల్ వేళ ఈ మాటలెలా?
అసలే హుజూరాబాద్ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని కేసీఆర్ తనదైన శైలి వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఏ సమీక్ష నిర్వహించినా, ఏ సమావేశం పెట్టినా.. హుజూరాబాద్ మాట లేకుండా ముగియట్లేదు. ఇలాంటి నేపథ్యంలో బీజేపీని ఎలాగోలా ఓడించేస్తాంలే అన్న భావనతో సాగుతున్న టీఆర్ఎస్ కు.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎంపికతో కాంగ్రెస్ పార్టీ మరింత బీపీ పెంచేస్తోంది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేశారు అంటూ స్వయంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోట నుంచే సంచలన వ్యాఖ్యలు వినిపించాయంటే.. అది గులాబీ దళానికి షాకే కదా. అయినా కాంగ్రెస్ మార్కు వ్యూహంతోనే రాములు నాయక్ ఈ కామెంట్లు చేశారా? అన్న దిశగానూ ఇప్పుడు ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
Must Read ;- రేవంత్ దెబ్బకు కేసీఆర్ బయటకొచ్చారా?