ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఈ నేరాలు ఏ బెదిరింపులకో, ఆన్ లైన్ మోసాలకో పరిమితం కావడం లేదు. చేతికి అందివచ్చిన సోషల్ మీడియాలో తమదైన శైలిలో రెచ్చిపోతున్న వ్యక్తులు.. ఎదుటివారు ఎలా ఫీలవుతారన్న విషయాన్ని మరిచి ఘాటు వ్యాఖ్యలు సంధిస్తున్నారు. ఈ తరహా ఘటనలతో ప్రముఖులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్న వైనం ఇటీవలి కాలంలో మరింతగా ఎక్కువైందనే చెప్పాలి. ఈ తరహా ఇబ్బంది ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబుకు కూడా ఎదురైంది. తనను తీవ్ర మనస్తాపానికి గురి చేస్తున్న ఈ తరహా పోస్టులపై ఆయన శనివారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సోషల్ మీడియా పోస్టులపై ఆవేదన
తెలుగు సినిమా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మోహన్ బాబు.. సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా ఉండరనే చెప్పాలి. అయితే ఆయన ఇద్దరు కుమారులతో పాటు కుమర్తె కూడా సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఉన్న తన వీడియోలపై ఇటీవలి కాలంలో కొందరు వ్యక్తులు పదే పదే అసభ్యకరమైన పదజాలంతో విరుచుకుపడుతున్నారట. ఈ వ్యాఖ్యలను చూసీచూడనట్లుగానే మోహన్ బాబు ఫ్యామిలీ వ్యవహరించినా.. ఈ మధ్య వీటి ప్రభావం మరింతగా పెరిగిందట. దీంతో ఇక లాభం లేదని భావించిన మోహన్ బాబు.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు.
అక్కడ అరెస్ట్.. ఇక్కడ ఫిర్యాదు
ఈ క్రమంలో శనివారం మోహన బాబు తరఫు లీగల్ అడ్వైజర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సినీ రంగానికి చెందిన సీనియర్ నటుడి నుంచే ఇలాంటి ఫిర్యాదు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియా పోస్టులపై మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేసిన సమయంలోనే.. అదే సోషల్ మీడియా వేదికగా ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై దూషణలు చేసిన కేసులో సీబీఐ అధికారులు ఏపీలోని కడప జిల్లాకు చెందిన లింగారెడ్డి రాజశేఖరరెడ్డిని అరెస్ట్ చేయడం గమనార్హం.
Must Read ;- జడ్జీలపై దూషణలు.. ఆ బ్యాచ్ కు మూడినట్టే











