అక్రమాస్తుల కేసులో 11 ఛార్జిషీట్లు ఎదుర్కొంటున్నఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్ రేపు విచారణకు రానుంది. సీబీఐ కోర్టు అడిగితే మరింత సమాచారం ఇవ్వడానికి కూడా సిద్దంగా ఉన్నట్టు రఘురామరాజు వెల్లడించారు. రేపు మధ్యాహ్నం కేసును విర్చువల్ గా ఆన్ లైన్లో విచారిస్తారని, అక్కడ ఎం జరిగిందో తరువాత మీడియాకు వివరిస్తానని ఆయన స్పష్టం చేశారు. మరికొన్ని గంటల్లోనే జగన్ బెయిల్ రద్దుపై విచారణ ప్రారంభం అవుతుందంటూ రఘురాజరాజు గుర్తు చేశారు.
ఇదేనా రాజన్న రాజ్యం
ఏపీలో రాజన్నరాజ్యం నడుస్తోందని, తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడానికి వైఎస్ షర్మిల పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారని రఘురామరాజు గుర్తు చేశారు. చీఫ్ లిక్కర్ అమ్మకాల్లో వేలాది కోట్లు దోచుకోవడం, ఇసుక తవ్వకాలను కమీషన్లకు కక్కుర్తి పడి అయిన వారికి కట్టబెట్టడం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రివర్సు టెండర్లు పిలిచి రూ.750 కోట్లు ఆదా చేశామని చెప్పుకుంటూ నేడు ఒకేసారి అంచనా వ్యయం రూ.1750 కోట్లు పెంచుకోవడం ఇదేనా రాజన్న రాజ్యం అని ఆయన ప్రశ్నించారు. వైఎస్ ఇంత దారుణంగా ఎప్పుడూ పరిపాలించలేదని, ఇది రాజన్న రాజ్యం కాదని ఆయన కుమారుడు ఇప్పటికే తీసుకువచ్చిన కొత్త మోడల్ అని ఆయన ఎద్దేవా చేశారు. పది లక్షల రూపాయల చిన్న పనులు చేసిన కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించకుండా, వారిపై విజిలెన్స్ అధికారులతో విచారణకు ఆదేశిస్తున్న ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం ఒకేసారి రూ.1750 కోట్లు ఎందుకు పెంచారో ప్రజలందరికీ తెలుసని రఘురామరాజు స్పష్టం చేశారు. కమీషన్ల కోసం ప్రాజెక్టు అంచనా వ్యయం పెంచుకుని కేంద్ర జల సంఘం పెంచమన్నది అని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పడం అంటే జనం చెవిలో పూలు పెట్టడమేనన్నారు. నివాసానికి పనికిరాని ఆవ భూములను 5 రెట్లు అధిక ధర చెల్లించి వేలకోట్లు దోచుకున్న వారు పార్టీలో పెత్తనం చెలాయిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
షర్మిల రాజన్న రాజ్యం తెస్తారంట..
షర్మిల తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడానికి త్వరలో పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారని, ఇప్పటికే ఏపీలో అన్న జగన్ రాజన్న రాజ్యం తీసుకువచ్చారని ఎంపీ రఘురామరాజు ఎద్దేవా చేశారు. అసలు రాజన్న రాజ్యం అంటే ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాజశేఖర్‌రెడ్డి పరిపాలనపై ప్రజల్లో అనుమానాలు కలిగే విధంగా రాజన్న రాజ్యం తీసుకువస్తామంటూ ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అన్న జగన్ ఏపీలో ప్రజలను పీల్చి పిప్పి చేస్తూ ఇప్పటికే రాజన్న రాజ్యం తీసుకువచ్చారని, ఇక చెల్లి షర్మిల తెలంగాణలో త్వరలో రాజన్న రాజ్యం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని రఘురామరాజు వ్యంగ్యంగా అన్నారు. అన్నా, చెల్లి కలసి రాజన్న రాజ్యం అర్థాన్ని మార్చి వేసి, కొత్త మోడల్ ప్రవేశపెట్టారని, ఇది రాజన్న రాజ్యం కాదని, ఇది కొత్త మోడల్ అని రఘురామరాజు ఎద్దేవా చేశారు.
విజయసాయిరెడ్డి స్థానంలో ఉమ్మారెడ్డి
త్వరలో విజయసాయిరెడ్డి జైలుకు వెళితే ఆయన స్థానంలో ఉమ్మారెడ్డిని నియమించే అవకాశం ఉందన్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబు తమకు శత్రువు కాదని, రాజకీయంగా ప్రత్యర్థి మాత్రమేనని ఎంపీ రఘురామరాజు గుర్తు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారని, అయితే ఎంపీ విజయసాయిరెడ్డి మాత్రం చంద్రబాబు పుట్టిన రోజున ఆయనపై విషం కక్కాడని, దీంతో జనం ఛీదరించుకుంటున్నారని ఆయన అన్నారు. విజయసాయిరెడ్డిని ఇలాగా వదిలేస్తే వైసీపీ నుంచి 15 శాతం ఓట్లు ఇతర పార్టీలకు పోయే ప్రమాదం ఉందని రఘురామరాజు అభిప్రాయపడ్డారు. చంద్రబాబుకు విజయసాయిరెడ్డి జన్మదిన శుభాకాంక్షలు చెప్పకపోయినా పరవాలేదని, కానీ ఆయనపై విషం కక్కడం వల్ల వైసీపీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన తెలిపారు.
తిరుపతి ఉప ఎన్నికలను అపహాస్యం పాలు చేశారు
తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓటర్లను తరలించడం ద్వారా వైసీపీ అధినేత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేశారని రఘురామరాజు ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు బీజేపీ అభ్యర్థి కూడా ఎన్నికలు రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. ఈసీ సరైన నిర్ణయం తీసుకుని ఉంటే తిరుపతి బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి హైకోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చేది కాదన్నారు. తిరుపతి ఉప ఎన్నిక రద్దు చేయకుండా ఫలితాలు ప్రకటిస్తే ఇక ప్రజాస్వామ్యానికి విలువే లేదన్నారు.
Must Read ;- పోలవరంపై జగన్ సర్కారు రివర్స్ గేమ్.. మిగిలిన దాని కన్నా మోయాల్సిందెంతో..!











