నాటి, నేటి ఆంధ్రప్రదేశ్‌లో14ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా, 16ఏళ్ల ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి నారా చంద్రబాబునాయుడు. రాజకీయ కోణంలో చాలామంది విమర్శించినా.. ఆత్మపరిశీలనలో మాత్రం చంద్రబాబుని నడిచే లైబ్రరీగా నాయకులు చెబుతుంటారు. ఆయన బాటే దర్శనికత అంటారు. 71ఏళ్ల జీవితంలో 44సంవత్సరాలకు పైగా రాజకీయంలోనే ఉన్న చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో చంద్రబాబు బర్త్ డే ను ట్రెండ్ చేయనున్నారు తెలుగు తమ్ముళ్లు.
అంతర్గతంగా మెచ్చుకోకుండా ఉండలేని పరిస్థితి..
ఇక చంద్రబాబు విషయానికి వస్తే.. ఆ పార్టీలో ఉండి.. వివిధ కారణాలతో బయటకు వెళ్లిన వాళ్లు, పదవులు అనుభవించిన వారు, పదవుల్లో ఉన్నవారు కూడా చంద్రబాబును అంతర్గతంగా మెచ్చుకోకుండా ఉండలేని పరిస్థితి. పదవులు, ఆర్థిక, సామాజిక, ప్రాంతీయ అంశాల కారణంగా చంద్రబాబును విమర్శించేవారు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఇప్పుడు చంద్రబాబును విమర్శిస్తున్న వారిలో 80 శాతానికి పైగా చంద్రబాబుతో పనిచేసినవారే అనడంలో ఎలాంతి అతిశయోక్తి కూడా లేదని చెప్పవచ్చు. అంతేకాదు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు జగన్, కేసీఆర్‌లు ప్రధాన ప్రత్యర్థిగా భావించిన చంద్రబాబు ఇన్నేళ్ల పదవీ కాలంలో ఒక్క అవినీతి కేసుకూడా రుజువుకాని నేతగా నిలిచారంటే ఆయన పాలన ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని వివిధ పార్టీలకు చెందిన నాయకులే చెబుతుంటారు. గిట్టనివారు ఎన్ని ఆరోపణలు చేసినా..పాలనలో సంక్షేమం, స్వయం ఉపాధి, సంపద సృష్టి, అణగారిన వర్గాలకు అవకాశాలే ప్రాతిపాదికగా టీడీపీ ప్రభుత్వం పనిచేసిందని చెప్పవారూ ఉన్నారు. అయితే చంద్రబాబు జీవితం వడ్డించిన విస్తరి కాదనే విషయం ఇక్కడ గుర్తించాలి. ఓటమి నుంచి విజయానికి అవకాశాలు వెతుక్కునే వ్యక్తిగా చంద్రబాబుకు పేరుంది. రాజ్యాంగ బద్ధమైన పోరాటంతోనే చంద్రబాబు ఎప్పటికప్పుడు నిలదొక్కుకుంటూ వస్తున్నారని చెప్పవచ్చు.
28 ఏళ్లకే మంత్రి..
చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 20, 1950లో చిత్తూరు జిల్లా నారావారిపల్లెలోఅమ్మణమ్మ-ఖర్జూర నాయుడులకు జన్మించారు. 1972లో బీ.ఏ పూర్తి చేసిన ఆయన.. శ్రీ వెంకటేశ్వర యూనిర్సిటీ నుంచి ఎకనమిక్స్‌లో పీజీ పూర్తి చేశారు. విద్యార్థి ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించారు. యువజన కాంగ్రెస్‌లో దివంగత సీఎం వైఎస్‌కి సహచరుడు కూడా. 1978లో తొలిసారిగా చంద్రగిరి నుంచి కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. 28 ఏళ్లకే అప్పటి టంగుటూరి అంజయ్య కేబినెట్‌లో మంత్రిగా చేశారు. 1981లో ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని వివాహం చేసుకున్నారు.
ఎన్టీఆర్‌తో కలసి..
1982లో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. ఒకానొక సమయంలో ఎన్టీఆర్‌పైనే పోటీకి సిద్ధమయ్యారు. 1982 ఎన్నికల్లో ఎన్టీఆర్ అల్లుడిగా ఉన్నా చంద్రగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగానే పోటీ చేశారు. అప్పట్లో ఎన్టీఆర్ ప్రభంజనం కారణంగా ఓడిపోయారు. తరువాతి కాలంలో టీడీపీలో చేరారు. టీడీపీలో అప్పట్లో కీలకంగా ఉన్న పర్వతనేని ఉపేంద్ర ద్వారా టీడీపీలోకి వచ్చినట్టు చెబుతారు. 1985 వరకు టీడీపీ ప్రధాన కార్యదర్శిగా చేశారు.
మార్పులు ఇవీ..
అప్పటికే టీడీపీలో నిబద్ధతకు ప్రాధాన్యం ఉండగా చంద్రబాబు పలు సంస్కరణలు చేపట్టారు. కార్యకర్తలకు శిక్షణ, మహిళా కార్యకర్తలకు ప్రత్యేక అవకాశాలు, క్రమశిక్షణ, క్షేత్రస్థాయిలో నాయకులతో కలసి ప్రచారం లాంటి కార్యక్రమాలు చేపట్టారు. అప్పట్లో కార్యకర్తలకు బీమా సౌకర్యం దేశంలోనే తొలిసారిగా ఇచ్చిన పార్టీగా టీడీపీ నిలిచింది. అదే సమయంలో ఎన్టీఆర్ హయాంలో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. ఎన్టీఆర్ నిర్వహించిన సమావేశానికి దేశ వ్యాప్తంగా ఉద్దండులుగా పేరున్న 60 మంది నాయకులు తరలివచ్చారు. ఇందుకు చంద్రబాబు అనుసరించిన విధానమేనని ఇప్పటికీ నాయకులు చెబుతారు. అయితే 1995లో పార్టీని చేతుల్లోకి తీసుకోవాల్సి వచ్చింది. ఈ విషయంపై విమర్శలు ఎదుర్కొంటున్నా.. ఆ రోజు పార్టీని రక్షించుకోకపోతే ఇప్పటికి టీడీపీ ఉండేది కాదనే అభిప్రాయం వివిధ పార్టీల్లో వ్యక్తం అవుతోందంటే చంద్రబాబు పార్టీకోసం ఎలాంటి విమర్శలను ఎదుర్కోవడానికైని సిద్ధపడ్డారని చెప్పవచ్చు. 1995 సెప్టెంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకే పట్టం గట్టారన్న విషయం కూడా ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. జన్మభూమి, శుభ్రత పరిశుభ్రత, శ్రమదానం, డ్వాక్రా సంఘాలకు రుణాల్లాంటి కార్యక్రమాలు అమలు చేశారు.
వాజపేయితో..
1999లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. దిగ్గజ నేత వాజపేయికి అత్యంత ఇష్టమైన నాయకుడిగా మారారు చంద్రబాబు. అదే సమయంలో స్పీకర్‌గా బాలయోగికి అవకాశం వచ్చింది. ఏపీజే అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేయటంలో చంద్రబాబుది కీలక పాత్రగా చెబుతారు. సీఎంగా ఉన్న సమయంలో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ లాంటివారితోపాటు అంతర్జాతీయంగా పలువురు పారిశ్రామిక వేత్తలను కూడా రాష్ట్రానికి రప్పించిన ఘనత కూడా చంద్రబాబుదే. హైటెక్ సిటీ, శంషాబాద్ ఎయిర్ పోర్టు ప్రణాళిక, అవుటర్ రింగ్ రోడ్డు ప్రణాళిక, ఐఎస్‌బీ, ఐసీఐసీఐ రిసెర్చ్ సెంటర్, జీనోమ్ వ్యాలీ, స్పోర్ట్ అకాడమీ..ఇలా హైదరాబాద్ తోపాటు పలు ప్రాంతాల్లో వివిధ రంగాల కంపెనీలను వచ్చేలా చేశారు. అప్పుడు పడిన పునాధి..ఇప్పటికీ పటిష్టంగా ఉందని చెప్పవచ్చు. తరువాతి కాలంలో కేసీఆర్ టీడీపీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు.
అలిపిరి ఘటన..
2003లో అలిపిరిలో మావోయిస్టులు చంద్రబాబు కాన్వాయ్‌ని పేల్చేశారు. ఈ దాడిలో చంద్రబాబు గాయపడ్డారు. ఆరునెలల ముందు ఎన్నికలను ప్రకటించారు. అయితే అనూహ్యంగా టీడీపీ ఓటమిపాలైంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యారు. చంద్రబాబు ప్రతిపక్షనేత అయ్యారు. 2009ఎన్నికల్లో కేసీఆర్‌తో పాటు పలు పార్టీలు కలసి కూటమిగా పోటీ చేశాయి. అప్పట్లో పీఆర్పీ ఏర్పాటైంది. టీడీపీ ఓట్లను, వైఎస్ వ్యతిరేక ఓట్లను చీల్చడంతో మళ్లీ వైఎస్‌కే అధికారం దక్కింది. అదే ఏడాది వైఎస్ హెలీకాప్టర్ ప్రమాదంలో మరణించారు.
తెలంగాణకు అనుకూలంగా లేఖ..
అప్పటికే తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోని నాయకుల ఒత్తిళ్లు ఉన్నా.. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చారు చంద్రబాబు. అదే సమయంలో 63ఏళ్ల వయస్సులో 2817కిలోమీటర్ల పాదయాత్ర ‘వస్తున్నా మీ కోసం’ చేపట్టి రికార్డు నెలకొల్పారు. రాష్ట్ర విభజన తరువాత 2014లో ఏపీలో పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో అనూహ్యంగా 15సీట్లు గెలిచింది. తరువాత జరిగిన పరిణామాలు, ఓటుకు నోటు కేసు, పలువురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరిన కారణంగా తెలంగాణలో పార్టీ బలహీనమైంది. ఏపీలో అధికారంలోకి వచ్చింది. విభజన తరువాత ఏపీ తొలి సీఎంగా చంద్రబాబు పేరు నిలిచింది. అయితే 2019 ఎన్నికల్లో ఆ పార్టీ 23స్థానాలకే పరిమితమైంది. ప్రత్యేక హోదా అంశంతోపాటు క్షేత్రస్థాయిలో కార్యకర్తల మనోగతాలను నాయకులు సరిగ్గా అంచనా వేయకపోవడం, అదే కోణంలో చంద్రబాబు వ్యూహాలు దెబ్బతినడం జరిగాయి. అమరావతిపై తప్పుడు ప్రచారాలను కూడా అడ్డుకోలేకపోవడం ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
అటు నిజాయితీ..ఇటు పోరాటం..
అయితే పార్టీ పని అయిపోయిందని చాలా మంది ఇతర పార్టీ నేతలు చెబుతున్నా.. అది టీడీపీ అని మరికొందరు చెబుతున్నారు. నాయకుల పార్టీ కాదు.. కార్యకర్తల పార్టీగా చంద్రబాబు నాయుడు టీడీపీని మార్చడమే ఇందుకు కారణమని చెబుతారు. ఎన్ని పోరాటాలైనా చేసేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉండడం, అవినీతి మకిలీ ఆరోపణలే తప్ప రుజువుల్లేకపోవడం, అప్పట్లో వైఎస్, ఇప్పుడు జగన్, కేసీఆర్‌లు ఎన్ని ఆరోపణలు చేసినా..ఒక్కటి కూడా నిరూపించలేకపోయారని, చంద్రబాబు పాలనలోని పారదర్శక విధానాలే ఇందుకు కారణమని కొందరు నాయకులు చెబుతుంటారు. ఇప్పటికే ఏడు పదుల వయస్సులోనూ పోరాటమే ఊపిరిగా ఉన్న చంద్రబాబు.. తెలుగు రాజకీయాల్లో నడిచే లైబ్రరీగా చెబుతారు. దార్శనికతకు చిరునామాగా అభివర్ణిస్తుంటారు. అంతేకాదు..సీఎంగా ఉన్నా లేకున్నా..అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా.. స్వీయ ఆస్తుల, కుటుంబ ఆస్తుల వివరాలను మీడియా సాక్షిగా ప్రకటించే దమ్మున్న, ధైర్యమున్న తమ నేత చంద్రబాబు అని టీడీపీ కార్యకర్తలు గర్వంగా చెబుతుంటారు. దేశంలోని టాప్ 10 మంది విజనరీ లీడర్ల జాబితాలో చంద్రబాబు పేరు ఇప్పటికీ వినిపిస్తుందంటే అదే మా చంద్రబాబునాయుడి ఘనత అని తెలుగు తమ్ముళ్లు చెబుతారు.
సమావేశాలు వద్దు..
గత ఏడాది కొవిడ్ కారణంగా తెలుగు తమ్ముళ్లు చంద్రబాబు పుట్టినరోజు కార్యక్రమాలు నిర్వహించుకోలేదు. అయితే ఈ సారి పెద్దయెత్తున సేవా కార్యక్రమాలు, సభలకు ప్లాన్ చేసుకున్నా.. కొవిడ్ కేసులు పెరుగుతుండడంతో అలాంటివి వద్దని చంద్రబాబు తమ పార్టీశ్రేణులకు ట్వీట్ చేశారు.
“నా జన్మదినానికి ఒక ప్రత్యేకత తీసుకురావడానికి మీరంత చేపట్టే కార్యక్రమాలు అభినందనీయం. అందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అయితే ఇప్పుడు కోవిడ్ నుంచి రక్షణ పొందడం చాలా అవసరం. అందుకే పుట్టిన రోజు సందర్భంగా ఎలాంటి సమావేశాలు నిర్వహించవద్దని టీడీపీ నేతలను, కార్యకర్తలను కోరుతున్నా. భౌతికదూరం పాటిస్తూ సురక్షితంగా ఉండాలి. మీ అందరి క్షేమమే నాకు జన్మదిన కానుక’’ అని ట్వీట్ చేశారు.
Must Read ;- అదీ.. చంద్రబాబు విజన్ అంటే..!
అందుకే నా పుట్టిన రోజు సందర్భంగా ఎలాంటి సమావేశాలు నిర్వహించవద్దని తెలుగుదేశం పార్టీ నేతలను, కార్యకర్తలను కోరుతున్నాను. దయచేసి మీరంతా ఒకరికొకరు భౌతిక దూరం పాటిస్తూ సురక్షితంగా ఉండండి. మీ అందరి క్షేమమే మీరు నాకిచ్చే జన్మదిన కానుక.(2/2)
— N Chandrababu Naidu (@ncbn) April 19, 2021