బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ అనుమానాస్పద స్థితిలో మరణించి జూన్ 14కు కచ్చితంగా ఏడాది. 34 ఏళ్ల వయసులోనే సుశాంత్ ఈలోకాన్ని వీడి వెళ్లిపోయాడు.
ఈ కేసు ఎన్నో మలుపులు తిరిగి చివరికి డ్రగ్స్ వైపు మళ్లింది. మృతి కేసు సీబీఐ చేతికి వెళ్లినా దాని గురించి ఎవరూ మాట్లాడటం లేదు.. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి వైపు కేసు మళ్లి డ్రగ్స్ తీగ కదిలింది. ఎన్సీబీ ఇప్పటికే ఎంతో మందిని విచారించినా ఇది కూడా కొలిక్కి రాలేదు. అసలు తెరవెనుక ఏం జరుగుతుందో ఎవరికీ అంతుబట్టడం లేదు. ‘ఎం.ఎస్.ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ’తో సుశాంత్ పేరు ఒక్కసారిగా బాలీవుడ్ లో మార్మోగింది.
చివరికి అంది సుశాంత్ అన్ టోల్డ్ స్టోరీగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. ముంబయి పోలీసులు, బీహార్ పోలీసులు, సీబీఐ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), ఎంఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లాంటివి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి. ఏంచేసినా కేసు మాత్రం కొలిక్కి రావడం లేదు.
పాట్నా నుంచి జీవిత పయనం
సుశాంత్ పుట్టిపెరిగిందంతా పాట్నాలోనే. ఆ తర్వాత అతని చదువు ఢిల్లీకి మారింది. ఇంజినీరింగ్ చదువును మధ్యలోనే ఆపేసి టీవీ సీరియల్స్ వైపు దృష్టి సారించాడు. 2008లో స్టార్ ప్లస్ లో ‘కిస్ దేశ్ మే హై మేరా దిల్’ అనే సీరియల్ తో అతని నట జీవితం ప్రారంభమైంది. ఆ తర్వాత జీ టీవీ సీరియల్ పవిత్ర రిష్ట లో అవకాశం వచ్చింది. క్రమేపీ అతని నట జీవితం సినిమాల వైపు మళ్లింది. చేతన్ భగత్ నవల ‘త్రీ మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్’ ఆధారంగా రూపొందిన ‘కయ్ పో చే’ సినిమాలో ముగ్గురిలో ఒక హీరోగా అవకాశం వరించింది.
అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద 43 కోట్లు వసూలు చేసింది. సుశాంత్ సినిమా కెరీర్ ఏడేళ్లే అయినా అందరూ అతన్ని గుర్తుంచుకునే పాత్రల్ని పోషించాడు. ప్రముఖ క్రికెటర్ ఎం.ఎస్. ధోని బయోపిక్ తో తీసిన సినిమా అయితే ఏకంగా రూ. 119 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా కోసం సుశాంత్ నాలుగు నెలల పాటు క్రికెట్ నేర్చుకుని ప్రాక్టీసు చేశాడు. సుశాంత్ సినిమా కెరీర్ లో కీలక పాత్ర ఇదే. ఈ పాత్రతోనే అతను జనం దృష్టిలో పడ్డాడు.
12 సినిమాలతో ముగిసిన జీవితం
నటుడిగా సుశాంత్ జీవితం 12 సినిమాలతోనే ముగిసిపోయింది. ధోనీ బయోపిక్ వచ్చే వరకూ సుశాంత్ అంటే సినిమా ప్రేమికులకు మాత్రమే తెలుసు. ఒక్కసారిగా ధోనీ పాత్రతో అతని పేరు అందరికీ తెలిసింది. అంతకుముందు పీకే లో అమీర్ ఖాన్ తో చేసినా ఎవరూ గుర్తుంచుకోలేని పాత్ర అది. ‘డిటెక్టివ్ బ్యోంకేష్ బక్షి’ని 2015 చేశాడు. దిబాకర్ బెనర్జీ దర్శకత్వం వహించిన మిస్టరీ యాక్షన్ సినిమా ఇది.
బెంగాలీ రచయిత శారదిండు బందోపాధ్యాయ్ సృష్టించిన డిటెక్టివ్ పాత్ర ఇది. ఇది బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది. సుశాంత్ నట జీవితంలో మరో కీలకమైన సినిమా ‘చిచోర్’. నితేష్ తివారీ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద స్లీపర్ హిట్ గా నిలిచింది, రూ. 147 కోట్ల వసూళ్లు సాధించింది. ‘దిల్ బేచారా’ సినిమాతో అతని నట జీవితం ముగిసిపోయింది.
దర్యాప్తులు ఏమయ్యాయి?
ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్నా ఇంతవరకూ కొలిక్కి రాలేదు. ఇది హత్యా, ఆత్మహత్యా అన్నది కూడా తేలలేదు. ముంబయి పోలీసులు మాత్రం ఇది ఆత్మహత్యేనంటూ తేల్చి చేతులు దులిపేసుకున్నారు. సీబీఐ చేతికి ఈ కేసు వచ్చి దాదాపు పది నెలలు పూర్తవుతోంది. ఇప్పటిదాకా ఈ కేసు పురోగతి వివరాలను వెల్లడించాలని పలువురు కోరుతున్నారు. రియా చక్రవర్తి, సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ పీతానీ, వంటవాడు నీరజ్, దీపేష్ సావంత్‌లతోపాటు అనేక మంది బాలీవుడ్ ప్రముఖుల వాంగ్మూలాలను సీబీఐ తీసుకుంది.
ఎన్సీబీ ఫలితాలుగానీ, ఈడీ ఫలితాలుగానీ వెల్లడికాలేదు. సుశాంత్ మరణించి ఏడాది పూర్తయింది కాబట్టి ఈరోజు మాత్రం సుశాంత్ ప్రియురాలు రియాను పిలిపించి ఎన్సీబీ విచారించింది. సినిమా రంగంలో చాలామంది మరణాలు లాగానే సుశాంత్ మరణం కూడా ఓ మిస్టరీగానే భావించి ఊరుకోవలసిందే. ఇది సుశాంత్ మరణం కేసు కాదు డ్రగ్స్ కేసు అని సరిపెట్టుకోవలసిందే. సుశాంత్ మరణించినా కేసు మాత్రం బతికే ఉందని సంతృప్తి పడాల్సిందే.
– హేమసుందర్
Must Read ;- సుశాంత్ సింగ్ ను తలచుకొని ఎంతో ఎమోషనల్ అయిన కృతీసనన్











