యంగ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో చెప్పుకోడానికి రెండే రెండు సినిమా లున్నాయి. కెరీర్ బిగినింగ్ లో వచ్చిన ‘అతడొక్కడే’, ఆ తర్వాత ‘పటాస్’. దీని తర్వాత కొంతలో కొంత చెప్పుకోదగ్గ సినిమాగా ‘118’ నిలిచింది. అందుకే కళ్యాణ్ రామ్ ప్రస్తుతం సరికొత్త కాన్సెప్ట్స్ మీద, ప్రయోగాల మీద దృష్టి సారించాడు. ఈ క్రమంలో ఈ హీరో ఇప్పుడో సాహసానికి సిద్ధమవుతున్నాడు. తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేయబోతున్నాడని టాక్స్ వినిపిస్తున్నాయి.
రాజేంద్ర అనే కొత్త కుర్రోడు ఈ మధ్య కళ్యాణ్ రామ్ ను కలిసి కథ వినిపించాడట. దానికి బాగా ఇంప్రెస్ అయిపోయిన అతడు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. నందమూరి వారి ఫ్యామిలీలో యన్టీఆర్ తర్వాత బాలయ్య, జూనియర్ యన్టీఆర్ సైతం ట్రిపుల్ రోల్స్ చేశారు. యన్టీఆర్ పౌరాణికాల సంగతి పక్కన పెడితే.. ఆయన ‘కులగౌరవం’ అనే సాంఘిక సినిమాలో కూడా త్రిపాత్రాభినయం (తాత, కొడుకు, మనవడుగా) చేశారు. అలాగే.. బాలకృష్ణ ‘అధినాయకుడు’ సినిమాలో ట్రిపుల్ రోల్స్ (తాత, కొడుకు, మనవడు) పోషించారు. ఆ తర్వాత జూనియర్ యన్టీఆర్ ‘జై లవకుశ’లో మూడు పాత్రలతో మెప్పించాడు.
అయితే ఈ మూడు సినిమాలు ప్రేక్షకుల్ని మెప్పించడంలో విఫలమయ్యాయి. ఇప్పుడు కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్స్ పోషించనుండడం ఆసక్తిగా మారింది. మైత్రీ మూవీస్ వారు ఈ సినిమాను నిర్మించడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. మరి తాత, బాబాయ్, తమ్ముడుకి వర్కవుట్ కాని ట్రిపుల్ రోల్ సెంటిమెంట్ కళ్యాణ్ రామ్ మీద ఎలా పనిచేస్తుందో చూడాలి.
Must Read ;- మలయాళ థ్రిల్లర్ ను రీమేక్ చేయబోతున్న కళ్యాణ్ రామ్ ?