పేరులో నేముంది అంటారుగానీ పేరులోనే అంతా ఉందేమో అనిపిస్తోంది. పిల్లల పేర్లు పెట్టడానికే తల ప్రాణం తోక కొస్తోంటే సినిమాకి పేరు పెట్టడం మామూలు విషయమా చెప్పండి. ఈ విషయంలో మన పూరి కన్నా ఘనాపాటిలు ఇంకెవరూ ఉండరేమో. మాస్ మసాలా ముందు పుట్టి ఆ తర్వాతే పూరి పుట్టి ఉంటారు. సినిమాలో మసాలా ఉంటే సరే.. కాదనలేం.. టైటిల్స్ లో కూడా ఈ మసాలా ఎందుకట? అని విమర్శించే వారికీ కొదవలేదు. తాజాగా విజయ్ దేవరకొండతో చేసే సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ వచ్చేశాయి.
ఆ సినిమా టైటిల్ ‘లైగర్’.. దీనికి సాలా క్రాస్ బ్రీడ్ అనే ట్యాగ్ లైన్ ఒకటి. ఉన్న ఒక్క లైనే అర్థం కాక చస్తుంటే ఈ ట్యాగ్ లైన్ తో సాధారణ జనం జుట్టు పీక్కున్నా సినిమా విడుదలయ్యాక వారి నోట అదో తారక మంత్రం అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇంతకీ ఆ టైటిల్ లో ఉన్న ప్రత్యేక ఏమిటంటే మగ సింహం ఆడ పులితో సంభోగిస్తే పుట్టేదాన్ని ‘లైగర్’ అంటారట. గుర్రానికి గాడిదకు పుట్టింది కంచర గాడిద ఎలానో అలా అన్నమాట. మరి ఈ లైగర్ లో హీరో తల్లిదండ్రులు కూడా పవర్ ఫుల్ అని జనం అర్థం చేసుకోవాలేమో.
రమ్య కృష్ణ ఓ కీలక పాత్ర కాబట్టి విజయ్ కి ఆమె తల్లి పాత్ర పోషిస్తుందని ఊహించుకునే వారూ ఉన్నారు. మరి మన లైగన్ బాక్సింగ్ లో తోపు అని గెటప్ చూస్తే అర్థమవుతోంది. మగ పులి ఆడ సింహాన్ని సంభోగిస్తే దాన్ని టైగన్ అంటారట. బహుశా ఈ పేరుతో ఓ సీక్వెల్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అసలు ఎవరు ఎవరితో సంభోగిస్తే ఏం పుడితే మనకెందుకు అనే విమర్శలు కూడా ఉపందుకున్నాయి. మొదట ఫైటర్ అనుకున్నా పేరు కాస్తా లైగర్ గా మారిపోయింది.
మరీ ఇంత ఊర మాస్ అయితే ఎలా?
పూరి మాస్ డైరెక్టరే కానీ మరీ ఇంత ఊరమాసా అంటూ జనం ముక్కున వేలేసుకుంటున్నారు. టైటిల్స్ తో ఈ జంతు ప్రయోగాలేమిటీ.. వేరే పేర్లేమీ దొరకలేదా అనే వారూ ఉన్నారు. పూరి సినిమా హీరో పక్కా మాస్ పాత్రలే ఉంటాయి. పైగా ఆయనది వర్మ స్కూలు కాబట్టి ‘నేనింతే’ అంటాడు. ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా పేరు ప్రకటించినప్పుడు కూడా విమర్శలు వచ్చాయి. గంగ మహిళ కాబట్టి కెమెరా ఉమన్ కదా అనాలి అన్న వాళ్లూ ఉన్నారు. సమాజంలో తిరిగే పక్కా పోరంబోకులాంతా ఆయన టైటిల్స్ లో కనిపించేస్తారు. రవితేజను ‘ఇడియట్’ గా చూపించడంతోనూ ఆయన ప్రయోగాలు ప్రారంభమయ్యాయనుకోవాలి.
పోకిరి, లోఫర్, దేశముదురు, రోగ్, ఏక్ నిరంజన్.. ఇళా ఇంకెన్ని టైటిల్స్ వస్తాయో. చిరుత అనే సాధారణ జంతువు పేరుతో చిరంజీవి తనయుడిని పరిచయం చేశారు. ఈసారి అంతకన్నా పవర్ ఫుల్ జంతువు కావాలేమో.. అందుకే లైగర్ అనే పేరు ఆయనకు దొరికినట్టుంది. మున్ముందు బద్మాష్, బాడకోవ్ లాంటి పేర్లు పెట్టి సినిమాలు తీసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా పూరిని చూసి ఇంకెందరు డైరెక్టర్లు వాత పెట్టుకుంటారో?
– హేమసుందర్ పామర్తి
Must Read ;- ‘లైగర్’ గా విజయ్ దేవరకొండ అదరగొట్టాడు