నాని హీరోగానే కాదు నిర్మాతగానూ ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడంలోనూ ముందుంటున్నారు. ఇక హీరో అడవి శేష్ విషయానికి వస్తే ఆయన సినిమాలన్నీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ఉంటాయి. మరి నాని, అడవి శేష్ కలిసి ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుందో కదా.. అదే ఇప్పుడు జరుగుతోంది. నాని వాల్ పోస్టర్ బ్యానర్ పై మొదటిసారిగా ‘అ’ సినిమా నిర్మించారు. దీనికి ప్రశాంతి త్రిపిర్ నేని దర్శకత్వం వహించారు. రెండో చిత్రం ‘హిట్’. క్రైమ్ నేపథ్యంలో సాగే కథతో రూపొందిన ఈ సినిమాలో విశ్వక్సేన్ హీరోగా నటించాడు.
తాజాగా ‘హిట్ 2’కి కూడా నాని శ్రీకారం చుట్టారు. ఈ సినిమా షూటింగ్ ను శనివారం లాంఛనంగా ప్రారంభించారు. దీనికి ది సెకండ్ కేస్ అనే ట్యాగ్ లైన్ నిర్ణయించారు. హిట్ దర్శకుడు శైలేష్ కొలను దీనికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. హిట్ చిత్రం కలెక్షన్ల పరంగానూ మంచి విజయాన్ని నమోదుచేసింది. ఈ తరహా సినిమాలకు న్యాయం చేయడంలో అడవి శేష్ దిట్ట. అందుకే ఇందులో హీరోగా ఆయనే చేస్తున్నారు. కృష్ణ దేవ్ అలియాస్ కె.డి. పాత్రను ఆయన పోషిస్తున్నారు. దీని రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది.
ఓ యువతి మిస్సింగ్ కేసును ఓ పోలీస్ ఆఫీసర్ ఎలా పరిష్కరించాడన్నది ఈ కథ. దీనికి జాన్ స్టీవర్ట్ ఎడూరి సంగీతం అందించబోతున్నారు. అడవి శేష్ కెరీర్ లో ఇది కూడా ఓ మంచి చిత్రంగా నిలిచే అవకాశం ఉంది. హీరో నాని సమక్షంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. హీరోగా నాని ఓ పక్క ఎంతో బిజీగా ఉన్నా మరో పక్క చిత్ర నిర్మాణం పైనా పూర్తిగా శ్రద్ధ పెట్టారు.
Must Read ;- ‘హిట్ 2’ లో రవితేజ హీరోయిన్?