దివంగత లెజెండరీ గాయకుడు.. గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రమణ్యం మరణం భారతీయ చిత్ర పరిశ్రమకు తీరని లోటు అనే చెప్పాలి. ఆయన పై ఉన్న గౌరవంతో సీనియర్ నటుడు, దక్షణాది సినీ, టెలివిజన్ ఆర్టిస్టుల యూనియన్ అధ్యక్షడు రాధారవి ఎస్.పి. బాలసుబ్రమణ్యం పేరు మీద ఒక డబ్బింగ్ స్టూడియోను చెన్నైలో ప్రారంభించారు. ఎస్.పి. బాలసుబ్రమణ్యం చనిపోయిన రోజే ఆయన పేరు మీద డబ్బింగ్ స్టూడియోను పెడతానని రాధారవి తెలిపారు. చెప్పినట్లుగానే రెండు నెలలో స్టూడియోను ప్రారంభించి ఎస్.పి. బాలసుబ్రమణ్యంపై తనకు ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు రాధారవి.
స్టూడియో ప్రారంభం సందర్భంగా రాధారవి మాట్లాడుతూ.. బాలసుబ్రమణ్యం పాటలు పాడటం మాత్రమే కాకుండా పలు సినిమాలకు డబ్బింగ్ కూడా చెప్పారని అన్నారు. బాలసుబ్రమణ్యంగారి పేరు మీద స్టూడియోను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని, ఆయన మన మధ్య జీవించి లేకపోయినా తను పాడిన పాటల రూపంలో ఎప్పుడూ బ్రతికే ఉంటారని అన్నారు. బాలసుబ్రమణ్యం స్టూడియోను ప్రారంభించడం పట్ల సినీ, టెలివిజన్ ఆర్టిస్టుల యూనియన్ సభ్యులు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
తమ అధ్యక్షుడు రాధారవిగారు చేసిన ఈ పని చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. బాలసుబ్రమణ్యం లాంటి వ్యక్తికి మన ఎంత గౌరవం ఇచ్చినా తక్కువేనని, అలాంటి మహానుబావుడు మన మధ్య లేకపోవడం మన దురదృష్టం అని అన్నారు. ఆయన పేరుపై స్టూడియోను ప్రారంభించిన రాధారావికి అనేకమంది సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు. బాలసుబ్రమణ్యంగారు తమిళంలో జెమినీ గణేశన్, రజినీకాంత్, కమల్ హాసన్, అర్జున్ వంటి హీరోలకు డబ్బింగ్ చెప్పిన విషయం తెలిసిందే.
Must Read ;- బాలూకు నాడు అది తొలిపాట.. నేడు ఇదే చివరి పాట