కేంద్ర మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు మొదలయ్యాయి. మరో నెల రోజుల్లో కేంద్ర మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకావం కనిపిస్తోంది. ఇటీవల ఇద్దరు కేంద్ర మంత్రులు మరణించడం, మరో ఇద్దరు రాజీనామా చేయడంతో మొత్తం నాలుగు మంత్రి పదవులు ఖాళీ అయ్యాయి. దీంతో ఇప్పటికే ఉన్న మంత్రులకు ఆ శాఖల బాధ్యతలు కూడా అప్పగించారు. వారికి పనిభారం పెరిగిపోయి, దస్త్రాలు పేరుకుపోతున్నాయి. దీనికితోడు ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముగ్గురిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
రుణం తీర్చుకుంటాం.
కేంద్రంలో ఎన్డీయే మిత్రపక్షం ఎల్జేపీ నేత రామ్ విలాస్ పాశ్వాన్ మరణంతో కేంద్ర మంత్రి పదవి ఖాళీ అయింది. దీనికి తోడు ఇటీవల బీహార్ ఎన్నికల్లో ఎల్జేపీని ఒంటరిగా పోటీలో దింపడంలో బీజేపీ సక్సెస్ అయింది. బీహార్ ఎన్నికల్లో 26 అసెంబ్లీ స్థానాల్లో మహాకూటమి అభ్యర్థుల ఓటమికి ఎల్జీపీ ఓట్ల చీలిక చక్కగా ఉపయోగపడింది. బీజేపీ వ్యూహంలో భాగంగానే ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్ ఒంటరి పోరాటం చేశారనే ప్రచారం బాగా వినిపించింది.. బీహార్‌లో ఒంటరి పోరాటం చేసి ఒక్క సీటుకే పరిమితమైన, ఎల్జీపీ అధినేత చిరాగ్ పాశ్వాన్ కు కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది బీహార్ ఎన్నికలకు ముందే జరిగిన ఒప్పందంగా భావిస్తున్నారు. బీహార్ ఎన్నికల్లో ఎల్జేపీ సహకారం లేకుండా ఎన్డీయే కూటమికి అధికారం దక్కేది కాదని బీజేపీ అగ్రనేతలు గ్రహించారు. అందుకే బీహార్ లో సహకారం అందించినందుకు, ప్రతిగా కేంద్ర క్యాబినెట్ లోకి చిరాగ్ పాశ్వాన్ ను ఆహ్వానించాలని బీజేపీ భావిస్తోంది.
Must Read: మోదీ దగ్గరవ్వాలంటే.. ప్రశాంత్ కిషోర్ దూరం కావాలా..
కాంగ్రెస్ ను చీల్చినందుకు సింథియాకు మంత్రి పదవి ఖాయం
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కీలక నేత సింథియా ఇటీవల బీజేపీలో చేరిపోయారు. ఎంపీలో ఇటీవల జరిగిన 28 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల్లోనూ సింథియా కీలకంగా వ్యవహరించి 19 స్థానాల్లో విజయం సాధించారు. దీంతో సింథియాను కేంద్ర క్యాబినెట్లోకి తీసుకుని కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చే వారికి మంచి పదవులు దక్కుతాయనే సంకేతాలను పంపాలని బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. దీని ద్వారా దేశంలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలనే వారి ఆశయం నెరవేర్చుకోవాలని పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.
సుశీల్ మోదీ మంచి పనోడు
బీహార్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన సుశీల్ మోదీకి పనితనంలో మంచి పేరుంది. జీఎస్టీ అమలులో బీహార్ లో కీలకంగా వ్యవహరించి మంచి మార్కులు కొట్టేశారు. అందుకే కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా సుశీల్ మోడీ సేవలను ఉపయోగించుకోవాలని బీజేపీ భావిస్తోందని తెలుస్తోంది.
మరికొందరికి ఛాన్స్
ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో 53 మంది మంత్రులు పనిచేస్తున్నారు. ఇటీవల నాలుగు మంత్రి పదవులకు ఖాళీ ఏర్పడింది. దీంతో మరో 26 మందిని క్యాబినెట్ లోకి తీసుకోవచ్చు. అయితే జంబో క్యాబినెట్ ఏర్పాటు చేసే అవకాశాలు లేవు. కానీ మరో ఆరుగురిని తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మిత్రపక్షాలను బీజేపీ చిన్నచూపు చూస్తోందన్న ప్రచారానికి తెర దింపేందుకు కేంద్రం మంత్రివర్గ విస్తరణను ఉపయోగించుకోవాలని చూస్తోంది. దీనికితోడు రాబోయే కొద్ది రోజుల్లో పశ్చిమబెంగాల్ ఎన్నికలు ఉన్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరిస్తారని తెలుస్తోంది.
Also Read: కేసీఆర్ తాతయ్యా.. మోదీ తాతయ్యా నాకు న్యాయం చేయండి











