(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ది శునకానందం తప్ప ఇంకేమీ లేదని, పంచాయతీ ఎన్నికల్లో శతశాతం ఫలితాలు తామే సాధిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, విజయనగరం జిల్లా ఇన్చార్జి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. గురువారం విజయనగరం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.
విజయనగరం జిల్లాలో 959 పంచాయతీలలో శతశాతం ఫలితాలు సాధిస్తామని, అందుకోసం నాయకులు, కార్యకర్తలతో సమాలోచనలు చేసామని, అందుకు కార్యాచరణ రూపొందించామని వెల్లంపల్లి తెలిపారు. నిమ్మగడ్డ రమేష్ ఎన్నికలు ఎందుకు ఆపారో, ఇప్పుడు ఎందుకు నిర్వహిస్తున్నారో తెలీటం లేదన్నారు. నిమ్మగడ్డ చర్యలు చంద్రబాబు ఆలోచనలు ప్రతిబింబిస్తున్నాయన్నారు. ప్రజల ఆరోగ్యం కంటే చంద్రబాబు శ్రేయస్సే ప్రధానంగా నిమ్మగడ్డ పనిచేస్తున్నారని తెలిపారు. ఎన్నికలంటే మాకు భయం లేదని.. మేము ఎన్నికలకు ఎప్పుడూ సిద్ధమేనని.. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ఆలోచించామని, తుది ఫలితాలు మాకే అనుకూలంగా ఉంటాయని అన్నారు.
మేనిఫెస్టో రిలీజ్ చేస్తారా?
పార్టీలకు అతీతంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికలకు ఎవరైనా మేనిఫెస్టో రిలీజ్ చేస్తారా? చంద్రబాబుకు మతి భ్రమించిందని వెల్లంపల్లి ఎద్దేవా చేశారు. 40 ఇయర్సు ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబు మతి భ్రమించి మానిఫెస్టో రిలీజ్ చేస్తే నిమ్మగడ్డ చౌదరి ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. నిమ్మగడ్డ తన చర్యలతో శునకానందం పొందుతున్నారని ఎద్దేవా చేశారు చంద్రబాబు తన సొంతమంటూ ఒక్క పథకం పేరైనా చెప్పుకోగలరా? అని ప్రశ్నించారు. అలా చెప్పుకునేందుకు ఆనాటి ఎన్టీఆర్ కు, వైఎస్ కు, నేడు జగన్ మోహన్ రెడ్డికి మాత్రమే చెల్లుతుందన్నారు.
జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టడం ఈ ఎన్నికలలో నిమ్మగడ్డ చూడబోతున్నారని తెలిపారు. ఈ ఎన్నికలు నిమ్మగడ్డకు , రాజకీయంగా చనిపోయిన చంద్రబాబుకు గుణపాఠం కానున్నాయని అన్నారు. చంద్రబాబు జై శ్రీరాం అన్నంత మాత్రాన ప్రజలు ఆయన్ను నమ్మరని, రామతీర్థం ఘటన దురదృష్టకరమని అన్నారు.
రామతీర్థంను మరో భద్రాద్రిగా చేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో స్థానిక ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Must Read ;- థ్రెట్ ఉందా? : హై సెక్యూరిటీ జోన్ లో నిమ్మగడ్డ!











