ఆర్ఆర్ఆర్.. సినీ అభిమానులందరూ ఆతృతగా ఎదురు చూస్తున్న భారీ సంచలన చిత్రం. కొమరం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించడంతో రోజురోజుకు అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించారు. ప్రపంచ వ్యాప్తంగా జనవరి 7న ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇటీవల ఈ సినిమా నుంచి నాటు నాటు.. అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
అయితే.. ఈ పాటలోని స్టెప్స్ వేయడానికి ఎన్టీఆర్, చరణ్ చాలా కష్టపడ్డారట. ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్ చెప్పారు. ఇంతకీ ఎన్టీఆర్ ఈ పాట గురించి ఏం చెప్పారంటే… నిజానికి అది చాలా చిన్న స్టెప్పే కానీ.. మూమెంట్స్, టైమింగ్ అన్నీ సరిగ్గా కుదరాలి. ఈ స్టెప్పు కోసం ఏకంగా 18 టేకుల వరకూ తీసుకున్నాం. 12 గంటలు కష్టపడ్డాం. మా కదలికల్లో చిన్న తేడా కనిపించినా రాజమౌళి మరోసారి చేద్దాం అనేవారు. ఈ స్టెప్పు కోసం ఇన్ని రీ టేకులు ఎందుకో అప్పట్లో అర్థం కాలేదు. ఈ పాటకు ఇప్పుడు వస్తున్న స్పందన చూస్తే.. ఇప్పుడు తెలిసొచ్చింది. మేము పడ్డ కష్టం మొత్తం మరచిపోయాం అని ఎన్టీఆర్ ఓ ఇంటర్ వ్యూలో చెప్పారు.
ఇప్పుడు సినీ అభిమానులు ఎవరి నుంచి విన్నా ఆర్ఆర్ఆర్ గురించే.. అందులో నాటు నాటు పాట గురించే. అంతలా జనంలోకి వెళ్లిపోయింది ఈ పాట. యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకెళుతూ.. సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా బాహుబలి సినిమా వలే చరిత్ర సృష్టించడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. 10వేల థియేటర్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆర్ఆర్ఆర్ ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తుందో అని బాలీవుడ్ సైతం ఆసక్తిగా ఎదురు చూస్తుంది.
Must Read ;- ఆ మూడు సినిమాల మీదే ఎన్టీఆర్ ప్రత్యేక దృష్టి











