జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా జెమినీ టీవీలో ప్రసారమవుతున్న ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ స్పెషల్ గెస్ట్ ఎపిసోడ్స్ ఈ షో మీద మరింత క్రేజ్ ను తీసుకువచ్చేందుకు ఉపయోగపడుతున్నాయి. ఈసారి స్పెషల్ గెస్ట్ మహేష్ బాబు అనే సంగతి తెలిసిందే. కేవలం ఒక్క సూపర్ స్టార్ మాత్రమే అయితే ఎలా.. దీనికి ఓ పవర్ స్టార్ ను జత చేస్తే షో మరింత రక్తి కడుతుంది అనే ఆలోచన నిర్వాహకులకు వచ్చినట్టుంది. నిజంగా అలానే జరిగిందా? ఆ సంగతేంటో చూద్దాం. ఈ ఎపిసోడ్ గురించి గత కొంతకాలంగా ఊరిస్తూ వస్తున్నారు. దసరా అన్నారు.. దీపావళి అన్నారు.. ఇటీవలే ప్రోమో విడుదల చేశారు.
ఈ ఎపిసోడ్ మీద ఎంత క్రేజ్ ఉందో వ్యూస్ చూస్తుంటేనే అర్థమవుతోంది. ఇంతకీ ఈ షో ముగింపులో మహేష్ బాబు రూ. 25 లక్షలు గెలిచారట. ఆ మొత్తాన్ని ఛారిటీకి ఉపయోగిస్తున్నట్లు మహేష్ ప్రకటించారట. స్పెషల్ ఎపిసోడ్స్ కు ఇంతకుముందు సమంత, రాజమౌళి, కొరటాల శివ లాంటి సెలబ్రిటీలంతా హాజరయ్యారు. తాజాగా హాట్ సీటు మీదకు మహేష్ బాబు ఆశీనులయ్యారు. నిజానికి ఈ ఎపిసోడ్ సెప్టెంబరు నెలాఖరులోనే షూటింగ్ పూర్తిచేసుకున్నట్లు సమాచారం. మహేష్ ని అన్నా అంటూ ఎన్టీర్ పిలవడాన్ని కూడా ఇరువురి అభిమానులు ఎంజాయ్ చేశారు. ఇద్దరూ ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకున్నారు.
మహేష్ హాట్ సీటులో కూర్చున్నాక అసలు కార్యక్రమం మొదలుపెట్టేశారు. ‘కరెక్ట్ ఆన్సర్ చెప్పినా దాన్ని ఇటు తిప్పి.. అటు తిప్పి అడుగుతున్నావు’ అంటూ మహేష్ ఎన్టీఆర్ పై సెటైర్ వేయగా దీనికి ఎన్టీఆర్ ‘ఏదో సరదాగా’.. అంటూ సమాధానం చెప్పారు. దాంతో ‘నీకన్నా మీ గురువుగారే బెటర్’ అని మహేష్ బాబు తనదైన పంచ్ విసరగా షోలో నవ్వులు విరిశాయి. ఇక మహేష్, ఎన్టీఆర్ మధ్య ఉండే వ్యక్తిగత సాన్నిహిత్యం ఎలాంటిదో ఈ ప్రోమోచూస్తేనే అర్థమైంది. ఈ షో ఎప్పుడు ప్రసారమవుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.
ట్విస్ట్ ఏమిటంటే మహేష్ బాబు ఓ ప్రశ్నకు సమాధానం చెప్పటానికి ఫోన్ లో ఫ్రెండును సంప్రదించే హెల్ప్ లైన్ తీసుకుంటారు. అక్కడ తన స్నేహితుడిగా పవన్ కళ్యాణ్ ను ఎంచుకుంటాడట. వెంటనే ఫోన్ లైన్ పవన్ కళ్యాణ్ కు కలపడం జరుగుతుందని అంటున్నారు. పవన్ ఇచ్చే సమాధానం తప్పు అవడానికి అవకాశం లేదు కదా. మొత్తానికి ఒకేసారి ముగ్గురు హీరోలను బుల్లితెరపై చూడవచ్చన్న మాట. ఈ షోలో చివరి గెస్ట్ కూడా మహేష్ బాబే కావచ్చు. టీఆర్పీ పరంగా షో దూసుకుపోవడానికి ఈ ఒక్క ఎపిసోడ్ చాలు.
Must Read ;- ఎన్టీఆర్ క్రేజీ ప్రాజెక్ట్స్ గురించి ఇంట్రస్టింగ్ అప్ డేట్స్











