( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి )
విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన సుమారు 5, 500 కోట్ల రూపాయలను ఒడిశాకు బదలాయించారని వాటివల్ల ప్లాంట్కు ప్రయోజనం లేకపోయిందని రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్ళడానికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పారు.
స్టీల్ ప్లాంట్ నష్టాల లెక్క తేల్చారు..
రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తనకున్న అకౌంటెంట్ పరిజ్ఞానానికి చాలా కాలం తరువాత పదును పెట్టి స్టీల్ ప్లాంట్ నష్టాల లెక్కల చిట్టాను వెలికి తీశారు. పరిశ్రమ నష్టాల్లోకి ఎలా వెళ్ళింది? ఆ నష్టాలకు కారణం ఎవరు? కారకులైన వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఇలాంటి అనేక అంశాలను వివరించారు. స్టీల్ ప్లాంట్ గత మూడేళ్లుగా ఎదుర్కొంటున్న నష్టాల మొత్తం నుంచి… మొత్తానికి సుమారు రూ.5, 500 కోట్లు మైనస్ చేయగలిగే లెక్కలు తేల్చారు.
ఒడిసా రాష్ట్రానికి చేరిన మొత్తం ..
రాయబరేలిలోని వీల్స్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి రెండు వేల కోట్లు రూపాయలు మళ్లించారని ఎంపీ చెప్పారు. అదే విధంగా ఒడిశా మైనింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు మైన్స్ అనుమతుల కోసం పదేళ్ల క్రితం రూ.361 కోట్లు చెల్లించినట్టు చెప్పారు. దానిపై మరో వెయ్యి కోట్ల రూపాయల జరిమానా రూపంలో చెల్లించామని, మొత్తం కలిపి రూ.1, 361 కోట్లు ఒడిస్సా మైనింగ్ శాఖకు చెల్లించామని తెలిపారు. నేటికీ మైన్స్ అనుమతి రాకపోగా, అసలు, వడ్డీ అలాగే ఉండిపోయాయని ఎంపీ వెల్లడించారు. పదేళ్ల క్రితం చెల్లించిన ఆ మొత్తం నేటికీ ఎంత అవుతుందో లెక్కలు వేసుకోవాలని ప్రజలకే వదిలేశారు. పైగా ఎన్నో ఏళ్ల నుంచి అసలు .. వడ్డీ చేతికి రాక.. లక్షలాది రూపాయలు సంస్థ నష్టపోయినట్టు వెల్లడించారు.
ఓ అధికారి అవినీతి ప్రస్తావన..
దీనికి తోడు గతంలో PK చాంద్ అనే MD స్థాయి అధికారి రెండు వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని, ఆ అధికారిపై నేటికీ చర్యలు తీసుకోలేదని స్పష్టం చేశారు. RINL కానీ, సిబిఐ కానీ, కేంద్ర ప్రభుత్వం గానీ ఆ మొత్తాన్ని రాబట్టలేకపోయిందన్నారు. ఇలా ఎన్ని వేల కోట్లు వృధా చేసి ఇప్పుడు నష్టాలను ప్లాంట్‌పై నెట్టడం సరికాదన్నారు.
ఒడిషా అధికారులపై ఆరోపణలు ..
స్టీల్ ప్లాంట్‌లో కీలక విభాగాలు అన్ని ఒడిస్సా అధికారుల చేతుల్లోకి వెళ్ళిపోయాయని, భవిష్యత్తులో ప్లాంట్ మొత్తం వారి కనుసన్నల్లోనే నడుస్తుందని , ఇదంతా కేంద్రం ఆడిస్తున్న నాటకమని ఆరోపణలు చేశారు. అయితే ఇందులో వాస్తవం ఉండడం కూడా గమనార్హం.
ఎంపీలతో ప్రధాని వద్దకు..
త్వరలో అన్ని పార్టీల ఎంపీలు ప్రధాని అపాయింట్‌మెంట్ తీసుకుని ఆయనకు వినతి పత్రం సమర్పించాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ క్రమంలో జాతీయ పార్టీలతో పాటు తెలుగుదేశం పార్టీ ఎంపీలను కూడా కలుపుకొని వెళతామని స్పష్టం చేశారు. సమస్యను వివరించి ప్రైవేటీకరణ సాధ్యం కాదని ప్రధాని మోడీకి చెబుతామని అన్నారు. శుక్రవారం కేంద్ర హోం శాఖ మంత్రి కలిసి వినతి పత్రం ఇస్తున్నట్టు వెల్లడించారు.
Must Read ;- మూడేళ్ల క్రితమే స్కెచ్.. విశాఖ ఉక్కును ‘పోస్కో’ పరం చేసేస్తారా?











