సాధారణంగా టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలన్నీ ఒన్ మేన్ షోస్ గానే ఉంటాయి. ప్రతీ సీన్ లో ఆ హీరో కనిపించే విధంగా.. సన్నివేశాలు రాసుకోకపోతే.. అభిమానులు ఊరుకోరు. అందులోనూ పవన్ కళ్యాణ్ లాంటి పవర్ స్టార్ అందులో హీరో అయితే ఇక చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు విచిత్రంగా పవర్ స్టార్ తాజా చిత్రం ‘వకీల్ సాబ్’ లో ఆయన పాత్ర కేవలం 50 నిమిషాలే అవడం అభిమానుల్ని ఆశ్చర్యపరుస్తోంది. అదే సమయంలో ఈ సినిమా ముగ్గురమ్మాయిల ప్రధాన పాత్రలు .. సినిమాలో ఎక్కువసేపు కనిపించడం కూడా అభిమానుల్ని ఆందోళనకు గురి చేస్తోంది.
బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ లో లాయర్ గా నటించిన అమితాబ్ పాత్ర .. సినిమాలో చాలా సేపటి తర్వాత కానీ ఎంటరవదు. ఒక విధంగా ఆయన సినిమాలో అతిథిపాత్ర పోషించారనే చెప్పాలి. అయితే తెలుగు వెర్షన్ వకీల్ సాబ్ లో మాత్రం పవర్ స్టార్ పాత్ర కోసం ఒక ఇంట్రడక్షన్ ఫైట్ , ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ , ఫైట్స్ .. లాంటి వన్నీ అదనంగా యాడ్ చేసుకొని మరీ రూపొందించారట. అయినప్పటికీ.. వకీల్ సాబ్ మొత్తం ప్రదర్శనా సమయం 2గంటల 30 నిమిషాలే అయినా.. అందులో పవర్ స్టార్ కనిపించేది 50 నిమిషాలే అవడం విశేషం. అయితే పవన్ కళ్యాణ్ తెరమీద కనిపించేంత సేపూ అభిమానులకు పూనకాలే అంటున్నారు. మరి వకీల్ సాబ్ 50 నిమిషాల్లో తెరమీద ఎంత సంచలనం సృష్టిస్తాడో చూడాలి.