స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలుగుదేశం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేస్తున్న అమరణ నిరహర దీక్ష ను పోలీసులు భగ్నం చేశారు. మంగళవారం తెల్లవారుజామున ఆయనను దీక్షా శిబిరంనుంచి ఆస్పత్రికి తరలించారు. అర్ధరాత్రి తర్వాత.. పోలీసులు హైడ్రామా నడిపించారు. పల్లా శ్రీనివాసరావును బలవంతంగా దీక్షా శిబిరంనుంచి తరలించారు. ఈ సందర్భంగా.. పల్లాను తరలిస్తున్న పోలీసు వాహనాన్ని తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులకు – కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. కార్యకర్తల్ని చెదరగొట్టిన పోలీసులు.. పల్లా శ్రీనివాసరావును నగరంలోని షీలా నగర్ కిమ్స్ ఐకాన్ ఆసుపత్రి కి తరలించారు.
రోజు రోజుకు ఆరోగ్యం క్షీణించడంతో దీక్ష భగ్నం చేసినట్లుగా పోలీసులు పేర్కొంటున్నారు.
చంద్రబాబు వస్తోంటే అంత భయమా?
మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆరు రోజులుగా విశాఖ ఉక్క పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన నిరాహార దీక్షకు పార్టీ రహితంగా అన్ని వర్గాలనుంచి ప్రజల మద్దతు కూడా వ్యక్తం అవుతోంది. ఈ దీక్షకు మద్దతుగా చేపట్టవలసిన ఇతర కార్యచరణ గురించి కూడా.. తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో ఒక సమావేశం కూడా నిర్వహించి ప్రణాళిక రూపొందించారు.
ఇదిలాఉండగా, విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించుకోవడానికి రాష్ట్రమంతా ఉద్యమం చేయాలని, ఈ పోరాటాన్ని రాష్ట్రం అంతటికీ విస్తరించాలని, అన్ని ప్రాంతాల ప్రజలు… రాష్ట్రానికి అన్యాయం జరగకుండా మేలుకోవాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం నాడు పిలుపు ఇచ్చారు. కేంద్రం తమ ఆలోచనను ఉపసంహరించుకునేలా.. ఈ అంశంపై పోరాటాల ఉధృతి పెంచాలని చంద్రబాబు నిర్ణయించారు.
అదే సమయంలో పల్లా శ్రీనివాసరావు అమరణ నిరహర దీక్ష కు సంఘీభావం తెలిపేందుకు చంద్రబాబు మంగళవారం నాడు విశాఖకు వచ్చేలా కార్యక్రమం ప్రకటించారు. దీక్షా శిబిరంలో పల్లాకు మద్దతు తెలియజేసి.. విశాఖ ఉక్కు కోసం పోరాటాన్ని మరింత బలోపేతం చేయాలని చంద్రబాబు అనుకున్నారు. అయితే చంద్రబాబు రావడానికి ముందుగానే.. పోలీసులు దీక్షను భగ్నం చేయడం విశేషం.
చంద్రబాబు మరికొద్ది గంటల్లో దీక్షాశిబిరానికి వస్తున్నారనగా.. పోలీసులు ఇలాంటి పని చేయడాన్ని తెలుగుదేశం నాయకులు ఓవరాక్షన్ గా అభివర్ణిస్తున్నారు. చంద్రబాబు వస్తున్నారనగానే,.. పోలీసులు పిరికితనంతో బలవంతంగా దీక్షా శిబిరాన్ని భగ్నం చేశారని ఆరోపిస్తున్నారు.
Must Read ;- పల్లా శ్రీనివాసరావు దీక్షకు సంఘీభావం తెలిపిన నారా లోకేష్..