దేశవ్యాప్తంగా సంచలనమైన సామాజిక కార్యకర్త దిశ రవి అరెస్టు వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. రైతుల దీక్షకు మద్దతుగా సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన పోస్టులు, షేర్ చేసిన అంశాలపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కాగా ఈ అరెస్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హింసను ప్రేరేపించే విధంగా..
బెంగళూరుకు చెందిన దిశ రవి ధిల్లీలో రైతుల ఆందోళనకు సంబంధించి స్వీడన్‌కు చెందిన పర్యావరణ ఉద్యమకారణి గెటా థెన్ బర్గ్ కొన్ని అంశాలను షేర్ చేశారు. అయితే గణతంత్ర దినోత్సవం రోజున ధిల్లీలో రైతుల ఆందోళనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో ఆమెపై కేసు నమోదైంది. హింసను ప్రేరేపించే విధంగా డాక్యుమెంట్‌ను టూల్ కిట్ ద్వారా రూపొందించి షేర్ చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ డాక్యుమెంట్‌ని ఎడిట్ చేసి, షేర్ చేసిన దిశ రవిపైనా కేసు నమోదైంది. కాగా ఈ అరెస్టు విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
డిగ్రీ పూర్తి చేసి..
ఈ కేసులో అరెస్టైన దిశ రవి విషయానికి వస్తే.. బెంగళూరులోని మౌంట్ కామెల్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన దిశ రవి ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ పేరుతో గ్రెటా థన్ బర్గ్ ప్రారంభించిన పర్యావరణ కార్యకర్తల టీంలో సభ్యురాలు. 2019లో ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ ఇండియా విభాగాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే గ్రెటా చేసిన పోస్టును దిశ ఎడిట్ చేసి షేర్ చేశారు. ఇక టూల్ కిట్ విషయానికి వస్తే.. ప్రీయాక్సెస్ ఆన్‌లైన్ ప్లాట్ ఫాం. ఈ డాక్యుమెంట్ ద్వారా ఏదైనా అంశాన్ని వివరణాత్మకంగా జతచేయడంతో పాటు కార్యాచరణనూ వివరించవచ్చు. అయితే గ్రెటా థన్ బర్గ్ షేర్ చేసిన కొన్ని అంశాలను దిశ రవి టూల్ కిట్‌లో యాడ్ చేసి షేర్ చేయడంతో ఈ టూల్‌కిట్ రైతులను రెచ్చగొట్టేలా ఉందన్న కారణంతో ఫిబ్రవరి 4న ఢిల్లీ పోలీసులు థన్ బర్గ్‌పై, దిశ రవిపై ఐపీసీ సెక్షన్లు 124ఏ, 120ఏ, 153ఏ కింద కేసులు నమోదు చేశారు. టూల్ కిట్ రూపకర్తల సమాచారం అందించాలంటూ గూగుల్, ట్విట్టర్‌లను కోరారు. ఆ రెండు సంస్థలు ఇచ్చిన వివరాల మేరకు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
Also Read ;- అంతర్జాతీయమైన రైతుల ఉద్యమం.. కేంద్రం స్పందన ఆసక్తికరం
ఆరోపణలు ఇవీ..
కాగా ‘ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్’ ద్వారా షేర్ అయిన ఈ టూల్ కిట్‌కు ఖలిస్థాన్ వేర్పాటు వాదుల సహకారం ఉందని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఖలిస్థాన్ అనుకూల సంస్థగా చెప్పే ‘పొయెటిక్ జస్టిస్ ఫౌండేషన్’ సంస్థ ఇందులో పాలు పంచుకుందని, కుట్ర పూరిత కార్యాచరణకు ప్లాన్ వేశారని ధిల్లీ పోలీసులు ఆరోపించారు. అలజడులు సృష్టించేందుకు కుట్ర పన్నారంటూ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఆరోపణలను దిశ రవి ఖండించారు. తాను కేవలం పర్యావరణ పరిరక్షణ కోసమే పోరాడుతున్నానని చెప్పారు. మరోవైపు దిశ రవి అరెస్టును ఖలిస్థాన్ అనుకూల సంస్థ పొయిటిక్ జస్టిస్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మో ధలీవాల్ తీవ్రంగా ఖండించడంపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కేంద్రం చెబుతోంది.
డాక్యుమెంట్‌లో ఏముంది..
ఇక ఈ టూల్ కిట్ డాక్యుమెంట్‌లో ఏముందనే అంశానికి వస్తే.. గ్లోబల్ ఫార్మర్స్ స్ట్రైక్-ఫస్ట్ వేవ్ పేరుతో ఉద్యమానికి మద్దతు తెలుపుతోంది. రైతులకు సంఘీభావంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించాలంటూ పోత్సహిస్తోంది. విదేశీ రాయభార కార్యాలయాలు, వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులకు సంబంధించిన కార్పొరేట్ కంపెనీల కార్యాలయాల వద్ద నిరసన తెలపాలని గతంలో పిలుపిచ్చింది. అయితే గతతంత్ర దినోత్సవానికి ముందు ఈ సంస్థ ఇచ్చిన పిలుపు కూడా చర్చనీయాంశమైంది. రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీలో అంతా పాల్గొనాలని పిలుపునిచ్చింది.
కాగా దిశ రవి అరెస్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ కూడా ఈ అరెస్టు హక్కులను కాలరాయడమేనని వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. ధిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఈ అరెస్టును ఖండించారు. ఇక దిశ రవిపై దేశద్రోహం కేసులు నమోదు చేసిన నేపథ్యంలో కేంద్రానికి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహం కేసు పెడతారా అనే చర్చకూడా మొదలైంది.
Also Read ;- మా దేశం గురించి మాకు తెలుసు: సచిన్