టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ పైనా ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎప్పుడో జరిగిన పర్యటనకు సంబంధించి తాజాగా శనివారం కృష్ణా జిల్లా సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో లోకేశ్ పై కేసు నమోదైంది. కరోనా నిబంధనలు ఉల్లంఘించారన్న కారణాన్ని చూపిన పోలీసులు లోకేశ్ పై కేసు పెట్టిన వైనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది.
టీడీపీ నేతలే లక్ష్యంగా కేసులు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా టీడీపీ నేతలపై కేసులు నమోదు చేస్తూ సాగుతున్న వైనం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు… ఆ తర్వాత మాజీ మంత్రి కొల్లు రవీంద్రనూ అరెస్ట్ చేశారు. ఆ తర్వాతా ఈ పరంపరను కొనసాగించిన ఏపీ పోలీసులు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్రకుమార్ నూ అరెస్ట్ చేశారు. మొన్నటికి మొన్న కర్నూలు జిల్లా బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డిపైనా కేసు నమోదు చేసిన ఏపీ పోలీసులు ఆయననూ అరెస్ట్ చేశారు. ఇక తమ పార్టీ టికెట్ పైనే ఎంపీగా గెలిచిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఏకంగా రాజద్రోహం కింద కేసు పెట్టిన జగన్ సర్కారు… ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఏ రీతిన అభాసుపాలైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారట
తాజాగా ఇప్పుడు నారా లోకేశ్ ను టార్గెట్ చేసిన ఏపీ ప్రభుత్వం… ఆయనపైనా కేసు నమోదు చేసింది. గతంలో అచ్చెన్నను అరెస్ట్ చేసిన సందర్భంగా ఆయనను పరామర్శించేందుకు కొల్లు రవీంద్రతో కలిసి కృష్ణా జిల్లా సూర్యారావుపేట కోర్టు సెంటర్ కు వెళ్లారు. ఇది జరిగి నెలలు దాటిపోతోంది. అయితే ఇప్పుడే లోకేశ్ అక్కడికి వెళ్లినట్టుగా భావించిన జగన్ సర్కారు… కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ కేసు నమోదు చేసింది. రెండు రోజుల క్రితం ఇదే సెక్షన్ల కింద మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపైనా ఏపీ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుల నమోదు వెనుక ఏపీ ప్రభుత్వం ఉద్దేశమిటనే విషయంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.
Must Read ;- ప్రతీ దెబ్బకి మూల్యం చెల్లించుకోక తప్పదు : నారా లోకేశ్