నెల రోజుల తరవాత బెయిల్ విడుదలైన సంగం డెయిరీ ఛైర్మన్,టీడీపీ సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్రను టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఇవాళ విజయవాడలో పరామర్శించారు.అక్రమ అరెస్టులతో ఈ ప్రభుత్వం రాష్ట్రంలో అరాచకాలకు పాల్పడుతోందని లోకేష్ ధ్వజమెత్తారు.ప్రభుత్వ పనికిమాలిన నిర్ణయాలను వ్యతిరేకిస్తే ప్రతిపక్ష నాయకులను జైల్లో పెడతారా అని ఆయన ప్రశ్నించారు.అక్రమ కేసుల ద్వారా అణచి వేయాలని చూస్తున్నారని,ప్రజలు క్షమించరని ఆయన అన్నారు.పాడి రైతులకు లీటరుకు రూ.4 ఎక్కువ ఇవ్వడమే దూళిపాళ్ల నరేంద్ర చేసిన నేరమా అని లోకేష్ ప్రశ్నించారు.ఏపీలో సంగం డెయిరీ,ఒంగోలు డెయిరీ,ఏపీ డెయిరీ ఆస్తులన్నీఈ అమూల్ బేబీ సీఎం,అమూల్ కంపెనీకి కట్టబెడుతున్నాడని ఆయన విమర్శించారు.డెయిరీ ఆస్తులు తాకట్టుపెట్టి రూ.3 వేల కోట్లు అప్పులు చేసి అమూల్‌కు ఇస్తున్నారని,ఈ అప్పులన్నీ ఏపీ ప్రజల నెత్తినే పడుతాయని ఆయన అన్నారు.ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన అక్రమ అరెస్టులను ఆయన మీడియాకు జిల్లాల వారీగా చదివి వినిపించారు.
అరాచకాలకు అంతే లేదు
ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించిన టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు.కొందరు అధికారులు చట్టాలను ఉల్లంఘించి పనిచేస్తున్నారని,అనుభవిస్తారని ఆయన అన్నారు.సొంత పార్టీ ఎంపీనే కస్టడీలో కొట్టారని,చిన్నాన్నను ఎవరు చంపారో కూడా తేల్చలేకపోయారని లోకేష్ అన్నారు.అధికారంలో ఎవరూ శాశ్వతం కాదని ఆయన అధికారులను హెచ్చరించారు.చట్టాలను ఉల్లంఘించి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్న వారిపై తగిన సమయంలో చర్యలుంటాయన్నారు.ఈ శాడిస్ట్ రెడ్డి,ఒక్క అడుగు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి ప్రభుత్వ ఆసుపత్రులను పరిశీలించాలన్నారు.ప్రతిపక్ష నాయకులపై ఎలా కేసులు పెట్టాలనే దానిపైనే తప్ప ఈ సీఎంకు ప్రజల సంక్షేమం పట్టడం లేదన్నారు.తనపై కూడా ట్రాక్టర్ ర్యాష్ డ్రైవింగ్ కేసు పెట్టారని,తనను కూడా ఈ కేసులో అరెస్టు చేస్తారేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
పోలీసుల నిఘా..
విజయవాడలోని దూళిపాళ్ల నివాసం వద్ద మఫ్టీలో పోలీసుల నిఘా ఏర్పాటు చేశారని తెలుస్తోంది.దూళిపాళ్లను పరామర్శించడానికి ఎవరెవరు వస్తున్నారనే అంశాలను వారు గమనిస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. విజయవాడలో దూళపాళ్ల నివాసానికి నారా లోకేష్ వస్తున్నారనే సమాచారంతో టీడీపీ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
Must Read ;- బెయిల్‌పై విడుదలైన దూళిపాళ్ల నరేంద్ర